Begin typing your search above and press return to search.

భారత్ పై పాక్ మళ్లీ పాత ఏడుపు... కేంద్రం నుంచి బిగ్ అలర్ట్!

అవును... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ పెద్ద ఎత్తున అసత్య ప్రచారన్ని చేసిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   6 Nov 2025 4:05 PM IST
భారత్ పై పాక్ మళ్లీ పాత ఏడుపు... కేంద్రం నుంచి బిగ్ అలర్ట్!
X

భారత్ పై బురద జల్లడం, దుష్ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ఆత్మవంచన చేసుకోవడం పాకిస్థాన్ కు బాగా అలవాటుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు, తిప్పికొట్టేందుకూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సుమారు 24 గంటలూ పని చేసిన పరిస్థితి.

ఆ ఆపరేషన్ సమయంలో నకిలీ వార్తలు, ఎడిట్ చేసిన వీడియోలు విపరీతంగా వ్యాప్తి చేసే ప్రయత్నం చేసింది పాక్. అయితే వాటిని గుర్తించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు అడ్డుకుంది. పాక్ తప్పుడు ప్రచారాన్ని వేగంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో సుమారు 1400 యూఆరెల్ లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయినప్పటికీ పాక్ మారలేదు.. మళ్లీ పాత అసత్యాన్ని ప్రచారం చేస్తూనే ఉంది.

అవును... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ పెద్ద ఎత్తున అసత్య ప్రచారన్ని చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా భారత ప్రతిష్టను మసకబార్చేందుకు తీవ్రంగా కృషి చేసింది. దాన్ని భారత్ బలంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో తాజాగా మళ్లీ మొదలుపెట్టింది పాక్. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి బిగ్ అలర్ట్ వచ్చింది.

తాజాగా కొన్ని పాకిస్థాన్‌ అనుకూల సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పాత వీడియోను తిరిగి ప్రసారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది ఆ దేశం. ఇందులో భాగంగా... భారత్‌ కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ ను తమ క్షిపణి కూల్చివేసిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. అయితే తాజాగా ఆ దుష్ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ దీటుగా స్పందించింది.

ఇందులో భాగంగా... ఆ వీడియో 2019లో జరిగిన ఘటనకు సంబంధించినదని కేంద్రం స్పష్టం చేసింది. భారత వాయుసేనకు చెందిన ఎమై-17 వీ5 హెలికాప్టర్ అప్పట్లో జమ్మూకశ్మీర్ లోని బుద్గాం సమీపంలో కూలిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. భారత్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి నకిలీ సమాచారాన్ని తరచూ ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

భారత ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు పాకిస్థాన్ ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుందని.. ఇలాంటి అసత్య ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారాన్ని ఎవరికైనా షేర్‌ చేసేముందు ధ్రువీకరించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

కాగా.... ఆపరేషన్ సిందూర్ సమయంలో కేంద్రం ఒక కేంద్రీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తూ.. అన్ని మీడియా సంస్థలకు నిజమైన సమాచార వ్యాప్తిని సులభతరం చేసింది. ఈ కంట్రోల్ రూమ్‌ లో భారత సైన్యం, నేవీ, వైమానిక దళం నుండి నోడల్ ప్రతినిధులతో పాటు వివిధ ప్రభుత్వ మీడియా విభాగాల అధికారులు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అధికారులు ఉన్నారు.