Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ పేమెంట్స్: ఫోన్‌పే కొత్త సేవ ‘యూపీఐ 123పే’ ఎలా పనిచేస్తుందంటే?

నేటి ఆధునిక కాలంలో డిజిటల్ చెల్లింపులు మన జీవితంలో ఒక భాగమైపోయాయి.

By:  A.N.Kumar   |   1 Sept 2026 5:00 AM IST
ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ పేమెంట్స్: ఫోన్‌పే కొత్త సేవ ‘యూపీఐ 123పే’ ఎలా పనిచేస్తుందంటే?
X

నేటి ఆధునిక కాలంలో డిజిటల్ చెల్లింపులు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్, హైస్పీడ్ ఇంటర్నెట్ ఉన్నవారు మాత్రమే ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉండేది. ఈ పరిమితిని అధిగమిస్తూ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేసుకునే అద్భుతమైన సదుపాయాన్ని ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫీచర్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ‘యూపీఏ 123పే’ పేరిట ఈ నూతన సేవలను ప్రారంభించింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు లేని.. ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వీరిని కూడా డిజిటల్ ఆర్ధిక వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఫోన్‌పే ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ 2జీ నెట్‌వర్క్‌పైనే పనిచేసేలా ఎస్ఎమ్‌ఎస్ సాంకేతికతతో దీనిని రూపొందించడం విశేషం. అంతేకాకుండా ఈ యూపీఐ 123పే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ప్రధాన థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్‌గా ఫోన్‌పే సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ సేవలను మరింత మందికి వేగంగా చేరువ చేసేందుకు నోకియా, లావా, ఐటెల్, హెచ్‌ఎమ్‌డీ వంటి ప్రముఖ ఫోన్ తయారీ సంస్థలతో ఫోన్‌పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు విడుదల చేసే కొత్త ఫీచర్ ఫోన్లలో ‘ఫోన్‌పే యూపీఐ 123 పే’ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ అయి వస్తుంది. దీనివల్ల వినియోగదారులు ప్రత్యేకంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా వినియోగించుకోవచ్చు.

ఈ ఫోన్‌పే యూపీఐ 123 పే ద్వారా వినియోగదారులు కేవలం మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఉపయోగించి ఇతరులకు సులభంగా డబ్బులు పంపవచ్చు. ఒకవేళ కెమెరా ఉన్న ఫీచర్ ఫోన్ అయితే వ్యాపార సముదాయాల్లో ఉన్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి కూడా క్షణాల్లో పేమెంట్లు చేయవచ్చు. డబ్బులు పంపడమే కాకుండా తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం.. గతంలో చేసిన లావాదేవీల వివరాలను పరిశీలించడం వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మొబైల్ రీఛార్జ్‌లు, కరెంట్ బిల్లుల చెల్లింపుల వంటి మరిన్ని సేవలను కూడా దీనిలో చేర్చనున్నట్లు సంస్థ ప్రకటించింది.

సాంకేతిక పరిజ్ఞానంపై పెద్దగా అవగాహన లేని గ్రామీణ ప్రజలకు, వయోవృద్ధులకు ఈ యాప్ వాడకాన్ని సులభతరం చేసేందుకు ఫోన్‌పే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ అసిస్టెంట్‌ను కూడా జోడించింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో ఇది వినియోగదారులకు వాయిస్ మార్గదర్శకత్వం అందిస్తుంది.

ఈ ఫోన్‌పే యూపీఐ 123 పే సేవలను యాక్టివేట్ చేసుకోవడం చాలా సులభం. మొదట ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేసి నిబంధనలను అంగీకరించాలి. ఆ తర్వాత తమ బ్యాంక్‌ను ఎంచుకుని, డెబిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు.. గడువు తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం తమకు నచ్చిన యూపీఐ పిన్‌ను సెట్ చేసుకుంటే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. చెల్లింపులు చేసే సమయంలో ‘పే టు మొబైల్’ లేదా ‘పే టు యూపీఐ ఐడీ’ ఆప్షన్‌ను ఎంచుకుని.. పంపాల్సిన మొత్తం.. పిన్ ఎంటర్ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులను సుసాధ్యం చేస్తూ ఫోన్‌పే చేపట్టిన ఈ చొరవ డిజిటల్ ఇండియా రంగానికి కొత్త ఊపునిస్తుందనడంలో సందేహం లేదు.