Begin typing your search above and press return to search.

ఒక్క బోటు.. 76 మందికి చేరిన మృతులు.. ఈ మరణ మృదంగం ఆగేదెలా?

ఫిలిప్పీన్స్‌లో చోటుచేసుకున్న ఘోర పర్యాటక బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

By:  A.N.Kumar   |   13 Sept 2026 10:54 AM IST
ఒక్క బోటు.. 76 మందికి చేరిన మృతులు.. ఈ మరణ మృదంగం ఆగేదెలా?
X

ఫిలిప్పీన్స్‌లో చోటుచేసుకున్న ఘోర పర్యాటక బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజధాని మనీలా నుంచి దాదాపు 130 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 76కు చేరినట్లు రెస్క్యూ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు బోటు మొత్తానికి వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు సముద్రంలోకి దూకారు.

విషపూరిత పొగతో ఆలస్యమైన రెస్క్యూ

ప్రమాదం జరిగింది మొదలు సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. బోటు తగలబడిపోవడంతో దాని నుంచి వెలువడిన ప్రమాదకర విషవాయువులు, దట్టమైన పొగ కారణంగా సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. దాదాపు మూడు రోజుల పాటు ప్రమాద స్థలంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెస్క్యూ చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి, విషవాయువుల తీవ్రత తగ్గడంతోనే రెస్క్యూ టీమ్‌లు బోటు ఆవరణలోకి ప్రవేశించగలిగాయి.

డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపు

మంటల తీవ్రతకు మృతదేహాలు దారుణంగా కాలిపోవడంతో వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. సాధారణ పద్ధతుల్లో మృతులను గుర్తించే అవకాశం లేకపోవడంతో అధికారులు డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా భౌతికకాయాలను బంధువులకు అప్పగించే ప్రక్రియను చేపట్టారు. తమ వారి ఆచూకీ కోసం బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి ఆసుపత్రులకు చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

భద్రతా ప్రమాణాలపై దర్యాప్తు వేగవంతం

ఈ ప్రమాదం ఫిలిప్పీన్స్ పర్యాటక రంగంలో భద్రతా లోపాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటి? బోటులో పేలుడు ఎలా సంభవించింది? అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించారా..? అత్యవసర నిష్క్రమణ మార్గాలు సక్రమంగా ఉన్నాయా.. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.

ప్రస్తుతం గల్లంతైన మిగతా ప్రయాణికుల కోసం తీరప్రాంత రక్షణ దళం సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. సాధారణ విహారయాత్ర కాస్తా పెను విషాదాంతంగా మారడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర గుండెకోత మిగిలింది. దర్యాప్తు నివేదిక వెలువడిన తర్వాతే ఈ ప్రమాదానికి బాధ్యులెవరనేది తేలనుంది.