Begin typing your search above and press return to search.

ఫిలిప్పీన్స్ లో వణికించిన భూకంపం... భయానక దృశ్యాలు వైరల్‌!

దక్షిణ ఫిలిప్పీన్స్‌ లోని మిండనోవా ద్వీపంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది.

By:  Raja Ch   |   10 Oct 2025 3:54 PM IST
ఫిలిప్పీన్స్  లో వణికించిన భూకంపం...  భయానక దృశ్యాలు వైరల్‌!
X

దక్షిణ ఫిలిప్పీన్స్‌ లోని మిండనోవా ద్వీపంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది. ఇదే సమయంలో... ఫసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అవి తీవ్ర భయానకంగా ఉన్నాయి!

అవును... శుక్రవారం ఫిలిప్పీన్స్‌ లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదే సమయంలో తీరప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు తెలిపారు.

మనీలాకు ఆగ్నేయాన దావో ఓరియంటల్‌ లోని మనాయ్ పట్టణానికి 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు! ఈ భూకంప తీవ్రతకు ఫిలిప్పీన్స్ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉండటంతోపాటు ఇండోనేషియా, పలావులలో చిన్న అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ భూకంప తీవ్రతతో అనేక భవనాలు కొన్ని సెకన్ల పాటు భారీగా కంపించాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ.. కొన్ని భవనాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో... టాగమ్ సిటీ దావో ఆసుపత్రి నుండి వచ్చిన వీడియోలో.. రోగులు, సిబ్బంది ప్రకంపనల మధ్య భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. కాగా... రెండు వారాల క్రితమే ఫిలిప్పీన్స్‌ లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. దాని ధాటికి సెబులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.