స్నానం బంద్.. చమటే సెంట్.. జెన్ జెడ్ బ్రోస్.. ఏందయ్యా ఈ ‘ఫెరోమోన్’ రచ్చ?
డేటింగ్‌కు వెళ్లే ముందు నీటుగా స్నానం చేసి.. నచ్చిన చొక్కా తొడుక్కుని.. గుబాళించే పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్లడం పాతకాలం పద్ధతి.
By: A.N.Kumar | 5 Sept 2026 8:31 AM ISTడేటింగ్‌కు వెళ్లే ముందు నీటుగా స్నానం చేసి.. నచ్చిన చొక్కా తొడుక్కుని.. గుబాళించే పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్లడం పాతకాలం పద్ధతి. మన జెన్ జెడ్ బ్రోస్ ఆలోచనలు ఎప్పుడూ కాస్త ‘డిఫరెంట్’గా ఉంటాయిగా.. ఇప్పుడు నెట్టింట ‘ఫెరోమోన్ మాక్సింగ్’ పేరిట ఒక వింత ట్రెండ్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. డేట్ కంటే రెండు రోజుల ముందే స్నానానికి సెలవు ప్రకటించడం.. పాత చమట దుస్తులే మళ్లీ వేసుకోవడం.. అంతటితో ఆగితే మనోళ్లు ఎందుకవుతారు? తమలోని ‘న్యాచురల్ అట్రాక్షన్’ను పెంచుకోవడానికి ఏకంగా మూత్రం కూడా కొందరు తాగుతున్నారట!
లూక్స్ మాక్సింగ్ ఓకే.. ఈ వాసనల మాక్సింగ్ ఏంది సామీ?
ఈ 'మాక్సింగ్' సంస్కృతిలో భాగంగా ఇప్పటికే లుక్స్, బాడీ బిల్డింగ్, స్కిన్ కేర్ అని రకరకాల ప్రయోగాలు చేశారు. ఇప్పుడేమో దృష్టి సహజ శరీర వాసన మీద పడింది. స్నానం చేయకుండా చమట వాసనతో వెళ్తే అవతలి వ్యక్తులు మన ‘ఫెరోమోన్స్’కు పడిపోతారని వీళ్ల గట్టి నమ్మకం. జంతువుల్లో ఫెరోమోన్స్ పనిచేస్తాయని సైన్స్ చెప్పింది నిజమే గానీ మనుషుల్లో చమట కంపు కొడితే ఆకర్షణ పెరుగుతుందని ఎక్కడా రాసి లేదు. నిజానికి ఆ వాసనకు పక్కన ఉన్నవాళ్లు పారిపోవడం ఖాయం.
మూత్రం తాగితే ప్రేమోస్తుందా? వైద్యుల నెత్తీనోరు
ఫెరోమోన్లు పెరుగుతాయనే అపోహతో మూత్రం తాగడం లాంటి అసహ్యకరమైన చర్యలకు పూనుకోవడం అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఇది ఆకర్షణను పెంచకపోగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఎవరో పెట్టిన పిచ్చి పోస్టులను బ్లైండ్‌గా ఫాలో అయిపోతే ఆసుపత్రి పాలవ్వడం ఖాయం.
దయచేసి స్నానం చేసి రండి బాబోయ్.. భారతీయ అమ్మాయిల రియాక్షన్..
ఈ వింత ట్రెండ్‌పై భారతీయ యువతులు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యాచురల్ బాడీ ఆర్డర్ వేరు, ఉద్దేశపూర్వకంగా మురికిగా రావడం వేరు. కనీస పద్ధతి లేకుండా వస్తే మొదటి డేటే ఆఖరి డేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియా సృష్టించిన ఇంకో దరిద్రమైన ‘డేటింగ్ హ్యాక్’. పర్ఫ్యూమ్ కొట్టుకోకపోయినా పర్లేదు కానీ చెమట కంపుతో వస్తే భరించడం కష్టం.
మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతిదాన్నీ 'ట్రెండ్' అని నమ్మేసి ప్రయోగాలు చేస్తే.. డేటింగ్ మాట దేవుడెరుగు.. కనీసం ఫ్రెండ్స్ కూడా పక్కన కూర్చోరు. సైన్స్‌ను, కనీస వ్యక్తిగత పరిశుభ్రతను మర్చిపోయి చేసే ఇలాంటి విన్యాసాలు ఆకర్షణను పెంచవు సరే కదా.. నవ్వులపాలు చేస్తాయి. సో బ్రోస్.. డేట్‌కు వెళ్లే ముందు శుభ్రంగా స్నానం చేసి.. మంచి సెంట్ వేసుకుని వెళ్లడమే అందరికీ శ్రేయస్కరం..
