ఫ్యూయల్ ఫైర్!..ఏ దేశంలో పెట్రోల్ ఎక్కువగా పెరిగిందో తెలిస్తే షాక్!
మన దేశంలో పెట్రోల్ లీటరుకు 3 రూపాయలు పెరిగితేనే అబ్బా.. ఎంత రేటు పెరిగిపోయిందో అని సామాన్యుల నుంచి అందరం తెగ ఫీలవుతాం.
By: Madhu Reddy | 17 May 2026 6:00 AM ISTమన దేశంలో పెట్రోల్ లీటరుకు 3 రూపాయలు పెరిగితేనే అబ్బా.. ఎంత రేటు పెరిగిపోయిందో అని సామాన్యుల నుంచి అందరం తెగ ఫీలవుతాం. బైక్ బయటకు తీయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ, ఫిబ్రవరి 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగిన పెట్రోల్ ధరల పెరుగుదలను చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! మన దగ్గర పెరిగిన 3 రూపాయలు వేరే దేశాలతో పోలిస్తే చాలా తక్కువని అర్థమవుతుంది. ఇంతకీ ఏ దేశంలో ఇంధన మంటలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మయన్మార్, పాకిస్తాన్‌లో రేట్ల మోత:
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు పెరిగిన దేశాల్లో మన పొరుగున ఉన్న మయన్మార్, పాకిస్తాన్ మొదటి వరుసలో ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 54 రూపాయల నుంచి 67 రూపాయల వరకు పెరిగింది. ఇక అక్కడ ఆర్థిక పరిస్థితులు, ఇంధన కొరత కారణంగా జనాలు పెట్రోల్ కొనాలంటేనే భయపడే రేంజ్‌లో రేట్లు పెంచేశారు.
అమెరికా, కెనడా, మలేషియాలో పరిస్థితి:
ఇక కాస్త అడ్వాన్స్‌డ్ దేశాలైన అమెరికా, కెనడాలలో కూడా ఫ్యూయల్ ఫైర్ గట్టిగానే తగిలింది. ఈ రెండు దేశాల్లో లీటరుకు దాదాపు 38 రూపాయల వరకు ధర పెరిగింది. అలాగే టూరిస్టులకు ఫేవరెట్ అయిన మలేషియాలో కూడా 36 రూపాయలు పెరిగింది. ఇక ఎప్పుడూ ఇంధన నిల్వలు పుష్కలంగా ఉండే గల్ఫ్ దేశమైన యూఏఈ లో కూడా లీటరుకు 28 రూపాయలు పెరగడం గమనార్హం.
చైనా మరియు యూరప్ దేశాల లెక్కలు:
మన మరో పొరుగు దేశం చైనాలో కూడా ఇంధన ధరల సెగ బాగానే తగిలింది, అక్కడ లీటరుకు 27 రూపాయలు పెరిగింది. ఇక యూరప్ దేశాల విషయానికి వస్తే.. ఫ్రాన్స్‌లో 13 రూపాయలు, యూకే లో 11 రూపాయల చొప్పున పెట్రోల్ రేట్లు పెరిగాయి. వీటితో పోల్చి చూసుకుంటే మన భారతదేశంలో తాజాగా పెరిగిన 3 రూపాయలు చాలా తక్కువ అనిపిస్తుంది కదూ..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గుల వల్ల అన్ని దేశాల్లోనూ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దగ్గర 3 రూపాయలు పెరిగితేనే బడ్జెట్ తలకిందులైపోతుందని గగ్గోలు పెడుతుంటాం, కానీ మిగతా దేశాల్లో లీటరుకు 30 నుంచి 60 రూపాయల దాకా పెరిగినా అక్కడి జనాలు భరిస్తూనే ఉన్నారు. ఇక ఏదేమైనా ఈ ఇంటర్నేషనల్ 'ఫ్యూయల్ ఫైర్' చూశాక.. మన పరిస్థితే చాలా బెటర్ అనిపించక మానదు!
