Begin typing your search above and press return to search.

పెట్రోల్ రేటు తగ్గుతుందా...లాజిక్ అక్కడే మిస్ !

ఎకనామిక్స్ లో ఒక అతి ముఖ్య సూత్రం ఉంటుంది. అదే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అధికం అయినపుడు సప్లై తగ్గినపుడు రేటు పెరుగుతుంది.

By:  Satya P   |   25 Jun 2026 9:03 AM IST
పెట్రోల్ రేటు తగ్గుతుందా...లాజిక్ అక్కడే మిస్ !
X

ఎకనామిక్స్ లో ఒక అతి ముఖ్య సూత్రం ఉంటుంది. అదే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అధికం అయినపుడు సప్లై తగ్గినపుడు రేటు పెరుగుతుంది. అదే డిమాండ్ తగ్గి సప్లై సౌకర్యవంతంగా ఉంటే రేటు దానంతట అదే దిగి వస్తుంది. ఇది సహజ మార్కెట్ సూత్రం కూడా. కానీ ఇండియాలో పెట్రోల్ రేటు అలా ఈ సూత్రానికి కట్టుబడి ఉందా అంటే డౌటే మరి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ సూత్రాలు ఎకనామిక్స్ సూత్రాలు ఏ మాత్రం వర్తించడం లేదని మేధావులు అనుకుంటే తప్పు వారిదే మరి. ఏ లాజిక్కులకు అందకుండా స్థిరంగా ఒకే చోట గాటకు కట్టేసినట్లుగా పెట్రోల్ రేటు నిలిచి ఉండడం అంటే బహుశా పెట్రోల్ రేటు వీటన్నింటికీ అతీతం కూడా అనుకోవాల్సిందేమో.

హర్మూజ్ కళకళలాడినా :

దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. దాని ప్రభావం సాధారణ ద్రవ్యోల్బణం మీదనే కాదు ఆహార ద్రవ్యోల్బణం మీద కూడా పడి పెను ప్రభావం చూపిస్తోంది. ఎందుకు పెరిగింది అంటే అంతర్జాతీయ పరిణామాలు అన్నారు. హర్మూజ్ జల సంధి వద్ద లాక్ చేశారు, మన చమురు నౌకలకు లంగర్ పడింది అని కూడా అన్నారు. అందుకే ఈ అధిక ధరలు అన్నారు. సర్లే పోన్లే అని ఆందోళన చెందినా జనాలు సర్దుకున్నారు. ఇపుడు చూస్తే హార్మూజ్ జల సంధి కళకళలాడుతోంది అని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు కూడా ఏకంగా నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి. అయినా సరే దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు అంటే ఆలోచించాల్సిందే మరి.

పెరిగినపుడు పెంచారు..తగ్గినపుడు :

క్రూడ్ ఆయిల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగినపుడు దేశంలో పెట్రో బాదుడు బాదేశారు. మరి అక్కడ దారుణంగా తగ్గిపోయింది. అయినా బాదేసిన పెట్రోలు డీజిల్ రేట్లు వెనక్కి వెళ్ళమంటున్నాయి. నెటిజన్లు అయితే ఇదే పాయింట్ పట్టుకుంటున్నారు. అన్ని లెక్కలూ చెబుతూ ఎందుకు తగ్గదు రేట్లు అని ప్రశ్నిస్తున్నారు. తగ్గాలి కదా పాయింటే కదా అని అంటున్నారు. లాజిక్ కూడా ఉంది కదా అని అంటున్నారు.

ఇధనాల్ ఇష్యూ సైతం :

ఇక పెట్రోల్ లో నూరు శాతం ఉండడం లేదు, ఈ 20 పేరుతో ఇధనాల్ ని 20 శాతం మిక్స్ చేస్తున్నారు. ఆ లెక్కన తీసుకున్నా ఇరవై శాతం అయినా రేట్లు తగ్గాలి కదా అని వాహనదారులు అడుగుతున్నారు. ఎందుకు రేట్లు సవరించడం లేదో వివరించాలి కదా అని కూడా అమాయకంగా ప్రశ్న వేసే వారూ ఉన్నారు. అయితే ఇదంతా ఎవరికీ అందని అర్ధం కాని ఒక బ్రహ్మ పదార్థం లాంటి మ్యాటర్ మరి.

కరోనా టైం గుర్తుందా :

కరోనా ముందు ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయల లోపు ఉండేది. అప్పట్లో కరోనా వల్ల ఇబ్బందులు ఆర్ధిక సంక్షోభం సవాళ్ళూ అంటూ పెంచుకుంటూ పోయారు. ఆ తరువాతా అంతా చక్కబెట్టినా 108 లీటర్ అన్న పెట్రోల్ రేటు అలా బంకులలో బోర్డు మీద చూపిస్తూనే ఉంది. ఈ మధ్యలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినవి తగ్గాయి కూడా. ఇంత జరిగినా ఎక్కడా పెట్రోల్ ధర అయితే తగ్గలేదు. ఇపుడు కూడా దేశంలో పెట్రోల్ ధరలు లీటర్ 117 అన్న నంబర్ అలా పెర్మనెంట్ గా ఉండిపోతుందా అంటే అంతేనేమో అనుకోవాల్సిందే ఎందుకంటే ఇక్కడ లాజిక్ మిస్ అవుతోంది మరి.