Begin typing your search above and press return to search.

పెట్రోల్.. రూపాయి.. చరిత్రలో మోడీని మర్చిపోరంతే!

మెరుపులు ఎన్ని సాధించినా..కొన్ని మరకలు వాటిని మాత్రం ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంటాయి.

By:  Garuda Media   |   3 Dec 2025 9:35 AM IST
పెట్రోల్.. రూపాయి.. చరిత్రలో మోడీని మర్చిపోరంతే!
X

మెరుపులు ఎన్ని సాధించినా..కొన్ని మరకలు వాటిని మాత్రం ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంటాయి. ఎంతటి తెల్ల వస్త్రమైనా సరే.. చిన్నపాటి మరకను ప్రత్యేకంగా.. హైలెట్ అయ్యేలా చేస్తుంది. స్వతంత్ర్య భారతంలో అరుదైన పాలనా విషయానికి వస్తే సమకాలీన కాలంలో తిరుగులేని రికార్డును క్రియేట్ చేసినోళ్లలో ప్రధానమంత్రి మోడీనే కనిపిస్తారు. ముచ్చటగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఆయన.. తన ప్రభుత్వ హయాంలో రెండు మరకల్లాంటి ఘటనల్ని నమోదు చేసుకున్నారు. అందులో ఒకటి పెట్రోల్ అయితే రెండోది రూపాయి మారక విలువ.

విచిత్రంగా ఈ రెండు అంశాలు సంపన్నుడి మొదలు సామాన్యుడి వరకు అందరూ ప్రభావితం అయ్యేవే. క్రూడాయిల్ ధర గరిష్ఠంగా నమోదైన వేళలోనూ నాటి ప్రభుత్వాలు పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించేవి. కానీ.. మోడీ సర్కారు మాత్రం అలాంటి మొహమాటాలకు పోలేదు. క్రూడాయిల్ ధరలు కనిష్ఠంగా ఉన్న రోజుల్లోనూ ధరలు తగ్గని పరిస్థితి.

లీటరు పెట్రోల్ ధర వందరూపాయిల మార్కును టచ్ చేసింది 2021 ఫిబ్రవరి 17న. అది కూడా రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ పట్టణంలో. దీనికి కారణం.. పెట్రోల్, డీజిల్ ధరల విషయానికి వస్తే ఆయా రాష్ట్రాలు అనుసరించే రాష్ట్ర పన్నుల (వ్యాట్) ఆధారంగా అన్నది తెలిసిందే. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో పెట్రోల్ లీటరు ధర రూ.100 చేరుకున్న తర్వాత దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలైన ముంబయిలో (మే 29, 2021), చెన్నైలో (జులై 2, 2021), ఢిల్లీ.. కోల్ కతాలలో 2021 జులై నాటికి రూ.100 మార్కును టచ్ చేసింది.

లీటరు పెట్రోల్ రూ.100 చేరుకోవటానికి ముందు రూ.75 మార్క్ ను 2018 మేలో టచ్ చేస్తే.. రూ.90 మార్కును 2021 ఫిబ్రవరి వరకు పట్టింది. అంటే లీటరు పెట్రోల్ రూ.75 నుంచి రూ.90 చేరుకోవటానికి సుమారు 2 సంవత్సరాల 9 నెలలు పట్టింది. అదే సమయంలో లీటరు పెట్రోల్ రూ.90 నుంచి రూ.100 చేరుకున్న వైనం చూస్తే.. 2021 ఫిబ్రవరిలో రూ.90గా ఉన్న లీటరు పెట్రోల్.. 2022 మార్చి నాటికి రూ.100 మార్కును టచ్ చేసింది. అంటే రూ.90 నుంచి రూ.100 చేరుకోటానికి ఒక ఏడాది ఒక నెల పట్టింది. సింఫుల్ గా చెప్పాలంటే 13 నెలల సమయం తీసుకుంది.

పెట్రోల్ సంగతి ఇలా ఉంటే డాలర్ తో రూపాయి మారకం విలువను తీసుకుంటే.. అంతకంతకూ బక్కచిక్కిపోతున్న రూపాయి కనిపిస్తుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ తొలిసారి రూ.50 మార్కును టచ్ చేసింది 2008లో. ప్రపంచ ఆర్థిక సంక్షోభ వేళలో డాలర్ తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయి తొలిసారి రూ.50కు చేరుకుంది. ఆ తర్వాత కిందకు పైకి లేవటం.. పడిపోవటం లాంటివి జరిగి 2011-12 నాటికి రూపాయి విలువ మళ్లీ పడిపోయి 2012 ప్రారంభంలో రూ.50 మార్కును స్థిరంగా దాటేసింది.

అలా పడటం మొదలైన రూపాయి ఒక అమెరికన్ డాలర్ కు రూ.75 మార్కు పడిపోవటానికి దాదాపు ఎనిమిదేళ్ల వరకు పట్టిందని చెప్పాలి. తొలిసారి రూ.75 మార్కుకు కొవిడ్ వేళలో చోటు చేసుకుంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా 2020 మార్చిలో రూ.75 మార్కును చట్ చేసింది. రూ.50 నుంచి రూ.75 చేరుకోటానికి అంటే రూ.25 పడిపోవటానికి సుమారు పదేళ్ల సమయం తీసుకుంది. ఇక.. రూ.75 నుంచి రూ.90 చేరుకోటానికి మాత్రం ఐదేళ్ల సమయం తీసుకుంది. తాజాగా ఒక డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.90 మార్కును టచ్ చేసి.. రూపాయి జీవితకాలం కనిష్ఠాన్ని నమోదు చేసింది.

ఇలాంటి వేళలోనే డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.100 మార్కును చేరుకుంటుందా? ఆ పరిస్థితి ఎప్పటికి ఏర్పడుతుందన్న ఆలోచనలు మొదలవుతాయి. అయితే.. రూ.90 మార్కును టచ్ చేసిన వేళ.. రూపాయి మరింత బక్కచిక్కకుండా ఉండేందుకు ఆర్ బీఐ చర్యలు తీసుకోవటంతో పాటు.. వేగంగా పడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే వీలుందని మాత్రం చెప్పక తప్పదు.

ఆర్థిక రంగ నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఏడాది (2026)లో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.92 వరకు చేరుకోవచ్చనిన చెబుతున్నారు. మరి.. వంద మాటేమిటి? అంటే.. కనీసం 2030 వరకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. అనూహ్య రీతిలో ఏమైనా ప్రపంచ ఆర్థిక సంక్షోభం లాంటివి.. దేశీయ ఆర్థిక వ్యవస్థలో అనూహ్యమైన ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటే తప్పించి వందకు చేరుకోవటానికి మాత్రం 2030 వరకు టైం తీసుకుంటుందని చెప్పక తప్పదు. మోడీ సర్కారు 2029 మే వరకు అధికారంలో ఉంటుంది. మరి.. ఆయన హయాంలోనే వందను టచ్ అయితే మాత్రం పెట్రోల్.. రూపాయి మారకం విలువలో సెంచరీ దాటేసిన మరక మాత్రం ఆయన మూటగట్టుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.