Begin typing your search above and press return to search.

బంకుల్లో నో స్టాక్.. గుట్టు విప్పిన డీలర్లు

అనవసరమైన ఆందోళన వద్దు. పెట్రోల్.. డీజిల్ కు అస్సలు కొరత లేదు. పుకార్లను నమ్మొద్దు. తప్పుడు ప్రచారాలు చేయొద్దు.

By:  Garuda Media   |   27 April 2026 11:03 AM IST
బంకుల్లో నో స్టాక్.. గుట్టు విప్పిన డీలర్లు
X

అనవసరమైన ఆందోళన వద్దు. పెట్రోల్.. డీజిల్ కు అస్సలు కొరత లేదు. పుకార్లను నమ్మొద్దు. తప్పుడు ప్రచారాలు చేయొద్దు. తగినన్ని నిల్వలు ఉన్నాయి. ఎలాంటి దిగులు వద్దు.. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ కు ఎలాంటి సమస్యా లేదని.. ఇబ్బందులు పడే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖ పదే పదే చెబుతోంది. ఇందుకు భిన్నంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల బంకుల్లో పెట్రోల్.. డీజిల్ లేదంటూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. శనివారంకొంత కనిపించినా.. ఆదివారం నాటికి ఈ సమస్య మరింత పెరిగినట్లుగా చెబుతున్నారు. పలు చోట్ల వాహనదారులు బారులు తీరుతున్న పరిస్థితి,

కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోలీసుల భద్రతమధ్య అమ్మకాలు చేపట్టాల్సిన పరిస్థితి. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే పలుచోట్ల ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాలు చెప్పే మాటల్ని కాసేపు పక్కన పెట్టి.. గ్రౌండ్ రియాల్టీని చూస్తే మాత్రం పెట్రోల్.. డీజిల్ కొరత కనిపిస్తోంది.అయితే.. లోపం ఎక్కడ ఉంది? అన్నది మరో ప్రశ్న. ఇంధనం కొరత తీవ్రంగా ఉందన్న మాట బంకుల యజమానుల నుంచి వినిపిస్తోంది. వారు అందిస్తున్న సమాచారాన్ని చూస్తే.. ఆయిల్ కంపెనీల నుంచి ఇంధనం సకాలంలో సరఫరా కావటం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.

ఇప్పటివరకు ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ప్రభుత్వం ధరలు పెంచటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఓటింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటం ఖాయమని.. ఈ కారణంగానే ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా దగ్గర దగ్గరగా నాలుగు వేలకు పైగా పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా బంకు యజమానులు ముందస్తుగా డబ్బులు చెల్లించటం లేదని.. ఈ కారణంగానే సరఫరాల్లో తేడా వచ్చిందన్న మాట వినిపించింది.

అయితే..తాజాగా బంకుల యజమానులు మాత్రం.. ముందస్తుగా డబ్బులు కట్టినా ఇంధన ట్యాంకర్లు రావటం లేదన్న మాటను చెబుతున్నారు. అమెరికా -ఇరాన్ యుద్ధానికి ముందు వరకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ చమురు సంస్థలకు స్టాక్ అందిన సాయంత్రం కానీ.. తర్వాతి రోజు ఉదయం కానీ డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే.. కొద్దిరోజులుగా మాత్రం డబ్బులు పంపితేనే ట్యాంకర్లు బంకులకు వచ్చేవి. ఇప్పుడు డబ్బులు ముందస్తుగా చెల్లించినా రెండు.. మూడు రోజులకు కానీ ట్యాంకర్లు రావటం లేదని పెట్రోల్ బంకు యజమానులు స్పష్టం చేస్తున్నారు.

అంటే.. పౌర సరఫరా శాఖ అధికారుల చెబుతున్న మాటల్లో నిజం లేదనే చెప్పాలి. గడిచిన రెండు.. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25 శాతం బంకులు స్టాక్ లేని కారణంగా బంకుల్ని మూసేశారు. ఏపీలోనూ ఈ తీవ్రత ఎక్కువగానే ఉందంటున్నారు. పశ్చిమాసియాలోని యుద్ధ పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం.. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగిపోవటం లాంటి కారణాలతో ఆయిల్ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి.రాజకీయకారణాలతో.. ధరల్ని అలానే ఉంచేశారు.

ఆసియాలోని దేశాల్లో చూస్తే.. యుద్ధం తర్వాత కనిష్ఠంగా 25 నుంచి 30 శాతం వరకు ధరలు ఆయా దేశాల్లో పెరిగిన పరిస్థితి. నష్ట భారాన్ని తగ్గించుకోవటానికి ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా స్టాక్ లేని కారణంగా బంకులు మూసి వేయగా.. హైదరాబాద్ లో మాత్రం ఒకట్రెండు చోట్ల మాత్రమే అలాంటి పరిస్జితి ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే.. నోస్టాక్ బోర్డులు పెట్టే ఆయిల్ బంకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేస్తే సరి. లేదంటే ప్యానిక్ బయ్యింగ్ మొదలవుతుంది. అప్పుడు పరిస్థితులు మరింతగా దిగజారతాయననది మర్చిపోకూడదు.