అమెరికా డాలర్ కు గోల్డ్ స్ట్రోక్... ఆర్థిక నిపుణుడి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇవి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద చేదువార్తలతో కూడిన హెచ్చరికలని అంటున్నారు. ఈ సందర్భంగా డాలర్ స్థానాన్ని బంగారం ఆక్రమించనుందనే ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి
By: Raja Ch | 30 Jan 2026 12:56 PM ISTగత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా వెండిని మించి బంగారం, బంగారాన్ని మించి వెండి కొండలు దాటి పర్వతారోహణాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక నిపుణుడు పీటర్ షిప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద చేదువార్తలతో కూడిన హెచ్చరికలని అంటున్నారు. ఈ సందర్భంగా డాలర్ స్థానాన్ని బంగారం ఆక్రమించనుందనే ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి
అవును... ఇటీవల ఎన్నడూ లేని స్థాయిలో బంగారం, వెండి ధరలు పోటా పోటీగా రికార్డు స్థాయిలను దాటుతున్న తరుణంలో.. ప్రముఖ ఆర్థిక నిపుణుడు పీటర్ షిప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమెరికాకు కీలక, బలమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా... విలువైన లోహాల పెరుగుదల శ్రేయస్సుకు సంకేతం కాదని.. ఇది పెరుగుతున్న లోతైన ఆర్థిక ఒత్తిడికి సంకేతమని అంటున్నారు. తాజా పెరుగుదలలు, పరిణామాలు రాబోయే ఆర్థిక సంక్షోభానికి హెచ్చరికలంటూ షిప్ వ్యాఖ్యానించారు!
ఇదే క్రమంలో.. ఇటీవల దావోస్ లో ప్రసంగిస్తూ ట్రంప్.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! అమెరికా అవునంటే ప్రపంచం అవునంటుంది.. అమెరికా కాదంటే దాన్నీ అనుసరిస్తుందన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి! ఈ విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందంటూ ట్రంప్ చేస్తున్న వాదనలను ఈ సందర్భంగా పీటర్ షిప్ తోసిపుచ్చారు. వాస్తవాలు అలా లేవని.. అధిక మార్కెట్లు చాలా భిన్నమైన చిత్రాన్ని సూచిస్తున్నాయని ఆయన బలంగా వాదించారు!
ఈ సందర్భంగా... ప్రపంచంలోనే అత్యంత హాట్ గా ఉండే ఆర్థిక వ్యవస్థ తమదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకోవచ్చు కానీ... ఆర్థిక మార్కెట్లు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ఆర్థిక వ్యవస్థ అని రుజువు చేస్తున్నాయని కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా ప్రపంచలోనే బలమైన, సురక్షితమైన కరెన్సీలలో ఒకటిగా పరిగణించబడే స్విస్ ఫ్రాంక్ తో యూఎస్ డాలర్ పనితీరును పరిశీనకు తెచ్చిన షిప్... ఫ్రాంక్ తో పోలిస్తే డాలర్ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయిందని నొక్కి చెబుతున్నారు.
ఇలా... బంగారం, వెండి ధరలు పెరగడం.. డాలర్, బాండ్ ధరలు తగ్గడం.. అన్నీ కలిసి ద్రవ్యోల్బణం, అధిక అప్పులు, ద్రవ్య నిర్వహణలో లోపాలతో ముడిపడి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయని.. ఈ పరిణామాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు డాలర్లను వదిలించుకుంటూ.. క్రమంగా బంగారం నిల్వలపై దృష్టి సారించాయని.. ఫలితంగా రాబోయే ఆర్థిక సంక్షోభం 2008 నాటి పరిస్థితుల కంటే అత్యంత భయంకరంగా ఉంటుందని.. ఇది అమెరికాకే పరిమితమవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎవరీ పీటర్ షిప్..!:
పీటర్ షిప్ ఒక ప్రసిద్ధ అమెరికన్ ఆర్థిక వేత్త, ఫండ్ మేనేజర్ మాత్రమే కాకుండా... సెంట్రల్ బ్యాంకింగ్, ఫియట్ కరెన్సీల లాంగ్ టర్మ్ క్రిటిక్ కూడా. ప్రధానంగా... 2008 ఆర్థిక సంక్షోభం బయటపడటానికి చాలా కాలం ముందే దాని గురించి హెచ్చరించడంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. ఈ పరిణామం.. ఆయన సపోర్టర్స్ లో మరింత నమ్మకాన్ని పెంచింది. ఈయన బంగారం, వెండితో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి బలమైన సంకేతాలను పంపుతుంటారు!
