Begin typing your search above and press return to search.

పీటర్ నవారో నుండి ఎలాన్ మస్క్‌కి మరో సవాలు

నవారో తన వ్యాఖ్యలలో 'ఎక్స్' ప్రస్తుత స్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను సరిదిద్దడానికి, కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాలని ఎలాన్ మస్క్‌ను డిమాండ్ చేశారు.

By:  A.N.Kumar   |   16 Sept 2025 10:31 PM IST
పీటర్ నవారో నుండి ఎలాన్ మస్క్‌కి మరో సవాలు
X

అమెరికా అధ్యక్షుడి వాణిజ్య సలహాదారు పీటర్ నవారో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. లాస్ ఏంజెలెస్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు 'ఎక్స్'లో చేసిన అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో స్పందిస్తూ 'ఎక్స్' చీకటి శక్తులకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు.

నవారో ప్రధాన ఆరోపణలు

నవారో తన వ్యాఖ్యలలో 'ఎక్స్' ప్రస్తుత స్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను సరిదిద్దడానికి, కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాలని ఎలాన్ మస్క్‌ను డిమాండ్ చేశారు. అనామక పోస్టులపై నియంత్రణ విధించాలని.. అనామక ఖాతాలను పూర్తిగా నిషేధించాలని నవారో సూచించారు. అనామక ఖాతాల ద్వారానే ఎక్కువ ద్వేషపూరిత, అభ్యంతరకర కంటెంట్ వ్యాప్తి చెందుతోందని ఆయన ఆరోపించారు. విదేశీ జోక్యంపై హెచ్చరంచారు. విదేశీయులు 'ఎక్స్'ను ఉపయోగించుకుని అమెరికా రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయకుండా చర్యలు తీసుకోవాలని నవారో కోరారు. చీకటి శక్తులకు వేదికగా మారిందని ఆరోపించారు. 'ఎక్స్' ఇప్పుడు అరాచక శక్తులు, దుర్మార్గమైన ఆలోచనలకు ఒక వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. దీనికి మస్కే తుది బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫ్యాక్ట్ చెకింగ్‌పై ఘర్షణ

ఇది కేవలం ఒక తాజా విమర్శ మాత్రమే కాదు. ఇటీవల రష్యా నుండి భారతదేశం చమురు దిగుమతి చేసుకోవడంపై నవారో చేసిన వ్యాఖ్యలను 'ఎక్స్' ఫ్యాక్ట్-చెక్ చేసి, ఆ పోస్టును ఫ్లాగ్ చేయడంతో వారిద్దరి మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భారత్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం లేదని, ఇంధన భద్రత కోసం మాత్రమే దిగుమతులు చేసుకుంటుందని 'ఎక్స్' పేర్కొంది. ఈ ఫ్యాక్ట్-చెక్ వ్యవస్థపైనా నవారో తీవ్రంగా మండిపడ్డారు.

హింసాత్మక పోస్టులు, మస్క్ స్పందన

ఇటీవల కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్య తర్వాత ఉటా రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ ఘటనను ప్రశంసిస్తూ కొందరు 'ఎక్స్'లో పోస్టులు పెట్టారు. దీనిపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేసి, అలాంటి పోస్టులను తీవ్రంగా ఖండించారు. వ్యక్తుల భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్‌ను అనుమతించబోమని ఆయన హెచ్చరించారు.

అయితే వేదిక మస్క్ సారథ్యంలోనే నడుస్తున్నందున, ఇటువంటి సంఘటనలకు ఆయనే బాధ్యత వహించాలని నవారో స్పష్టం చేశారు. మొత్తానికి, 'ఎక్స్'లో కంటెంట్ మోడరేషన్, ఫ్యాక్ట్ చెకింగ్ విధానాలు, అనామక ఖాతాలపై నవారో చేసిన విమర్శలు ఎలాన్ మస్క్‌కు మరో పెద్ద సవాలుగా మారాయి. ఈ ఘర్షణ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.