Begin typing your search above and press return to search.

జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం... మధ్యలోకి పవన్ ని లాగిన పేర్ని నాని!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో "రప్పా రప్పా" వ్యవహారం రోజు రోజుకీ తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   28 Dec 2025 10:54 PM IST
జగన్  ఫ్లెక్సీలకు రక్తాభిషేకం... మధ్యలోకి పవన్  ని లాగిన పేర్ని నాని!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో "రప్పా రప్పా" వ్యవహారం రోజు రోజుకీ తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తప్పేముంది.. ఇది ఓ సినిమాలో డైలాగు.. సినిమా డైలాగులు చెప్పినా తప్పేనా స్వామీ అంటూ ఈ విషయంపై జగన్ గతంలో స్పందించగా.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు మంచివి కావని కూటమి నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా రప్పా రప్పా రక్తతర్పణాలపై పేర్ని నాని స్పందించారు.

అవును... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లో ఇప్పుడు రప్పా రప్పా అనేది అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ డైలాగులు ‘పుష్ప-2’ సినిమాలో కంటే ఏపీ రాజకీయాల్లోనే మరింత వైరల్ గా మారాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేశారు.

ఇందులో భాగంగా... పొట్టేళ్లను నరికి జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలకు రక్తతర్పణాలు చేశారు! ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలో 16 కేసులు నమోదు చేశారు. ఇందులో పలువురికి బెయిల్ రాగా, మరికొంతమందిని రిమాండ్ కి పంపిన పరిస్థితి. ఈ 16 కేసుల్లో మొత్తం 100 మందికిపైగా నిందితులు ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా కేడర్ కు కీలక సూచన చేసింది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన పేర్ని నాని.. ఓ వైపు కూటమి ప్రభుత్వపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు వైసీపీ కేడర్ కు సూచనలు చేశారు. ఇందులో భాగంగా... గతంలో చంద్రబాబు, బాలకృష్ణ పుట్టినరోజులు, ఎన్నికల్లో విజయాల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కూడా ఇలాంటి రక్తతర్పణాలు చేశారని చెబుతూ.. వాటికి సంబంధించిన వీడియోలను ఆయన బయటపెట్టారు! ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను మధ్యలోకి లాగారు!

ఇందులో భాగంగా... నాడు టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు ఇలా రక్త తర్పణాలు ఇస్తున్నప్పుడు.. కూటమిలో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. అప్పుడే వీటిపై పవన్ కల్యాణ్ స్పందించి.. వాళ్లను మోకాళ్లపై నిలబెట్టి.. కాలుకు కాలు, కీలుకి కీలు తీసి ఉంటే ఇలాంటివి ఇప్పుడు పునరావృతం అయ్యేవి కావని అన్నారు. ఇదే క్రమంలో... రెడ్ బుక్ ప్రస్థావనను పేర్ని నాని తీసుకొచ్చారు.

ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో మీరు బెదిరింపులకు దిగడం వల్లే.. మా వాళ్లు రప్పా రప్పా అని అంటున్నారని చెప్పిన పేర్ని నాని.. గదిలో పెట్టి పిల్లిని కొడితే అది తిరగబడుతుందని.. వైసీపీ వాళ్లు పిల్లి కంటే తక్కువా అని ప్రశ్నించారు. మనం అధికారంలోకి వచ్చాక దీనిపై సిట్ వేద్దామని.. తప్పులు చేసిన వాళ్లను చట్ట పరిధిలో శిక్షిద్దామని.. అందువల్ల వాళ్లను చూసి మీరు తప్పులు చేయవద్దని కార్యకర్తలకు పేర్ని నాని సూచించారు.