Begin typing your search above and press return to search.

ప్రతి 3 నెలలకోసారి గొడవ పడటం పేర్ని నానికి అలవాటా?

అప్పుల అప్పారావు.. సంబరాల రాంబాబు.. పేకాట పాపారావు.. లాంటి పాపులర్ తెలుగు సినిమాల గురించి తెలియని వారుండరు.

By:  Garuda Media   |   3 April 2026 9:51 AM IST
ప్రతి 3 నెలలకోసారి గొడవ పడటం పేర్ని నానికి అలవాటా?
X

అప్పుల అప్పారావు.. సంబరాల రాంబాబు.. పేకాట పాపారావు.. లాంటి పాపులర్ తెలుగు సినిమాల గురించి తెలియని వారుండరు. అలానే తెలుగు రాజకీయాల్లో.. మరి ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే.. పంచాయితీల పేర్ని నాని గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి. అదే పనిగా విరుచుకుపడటం.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటం.. నువ్వెంత అంటే నువ్వెంత? అన్నట్లుగా నిప్పులు చెరగటం లాంటివి పేర్ని నానికి ఉన్న సుగుణాల్లో కొన్ని. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ఇప్పటివరకు గడిచిన కాలాన్ని నిశితంగా పరిశీలిస్తే ఒక ఆసక్తికర కోణం కనిపిస్తుంది.

అదేమంటే.. ప్రతి మూడు.. నాలుగు నెలలకు ఒకసారి ఏదో ఒక అంశంపై రచ్చ చేయాల్సిందే. ఏదో ఒక అధికారిని నోటికి వచ్చినట్లు తిట్టిపోయాల్సిందే. ఆసక్తికర అంశం ఏమంటే.. ఆయన ఎన్ని మాటలు అన్నా.. మహా అయితే కేసులు నమోదు అవుతాయే తప్పించి.. చర్యల కర్ర మాత్రం బయటకు రాదు. ఈ కారణంతోనే.. తరచూ పూనకం వచ్చినోడిగా అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా ఆడిపోసుకోవటంలో పేర్ని ట్రాక్ రికార్డును ఎవరూ బీట్ చేయలేరనే చెప్పాలి.

కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ఇప్పటివరకు పేర్ని నానిపై ఐదు నుంచి ఆరు కేసులు ప్రధానంగా నమోదైనట్లుగా రికార్డులు చెబుతుంటాయి. ఆశ్చర్యకరంగా ఆయనపై ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఆయనపై ఇప్పటివరకు నమోదైన కేసుల్ని చూస్తే.. చాలా సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలపైనా.. అధికారులపైనా బెదిరింపులకు దిగటం.. విధులకు ఆటంకం కలిగించే కేసులు ఆయనపై ఇప్పటికే నమోదయ్యాయి. అయినా ఒక్కకేసులోనూ ఆయన అరెస్టు కాని ఇస్పెషల్ నేతగా పేర్ని నానిని చెప్పాలి.

కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పేర్ని నానిపై నమోదైన కేసుల్ని చూస్తే..

డిసెంబరు 2024

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో పేరు ప్రస్తావనకు రావటం.. పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఎలాంటి చర్యలు ఆయనపై తీసుకోలేదు.

జూలై 2025

అవనిగడ్డ.. పామర్రు నియోజకవర్గాల్లో జరిగిన పార్టీ సమావేశాల్లో "రప్ప రప్ప" వంటి వివాదాస్పద పదజాలం వాడుతూ, హింసను ప్రేరేపించేలా మాట్లాడారనే ఆరోపణలపై కేసులు.

అక్టోబరు 2025

మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో మేకల వెంకట సుధాకర్ బాబు అనే నిందితుడ్ని విచారిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని.. అధికారులను బెదిరించారన్న ఆరోపణ. అంతేకాదు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు బీఎన్ఎస్ సెక్షన్లు 61(2), 132, 126(2), 189(2), 190 కింద కేసు నమోదైంది.

జనవరి 2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఇనగుదురు, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు.

మార్చి 2026

మచిలీపట్నంలో జనసేన జెండా ఆవిష్కరణ సందర్భంగా సెక్షన్ 30 నిబంధన అమల్లో ఉన్నా.. దాన్ని అతిక్రమించి పోలీసులతో వాగ్వాదం

ఏప్రిల్ 2026

మచిలీపట్నంలోని ఆరో వార్డులో ఆక్రమణల తొలగింపు సమయంలో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. ఇతర అధికారులను ‘మా ప్రభుత్వం వచ్చాక మీ అంతు చూస్తాం’ అని బహిరంగంగా హెచ్చరించారు. ఈ ఘటనపై ఆయనతో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుపై కూడా పోలీసులు కేసు నమోదు.