పేర్ని నానిపై రౌడీషీట్ తెరుస్తారా? పొలిటికల్ రచ్చ.. !
పేర్ని నాని అన్ని హద్దులు దాటేశారని.. ఇక, ఊరుకునేది లేదని గట్టి సమాధానం పోలీసుల నుంచే వస్తుందని కొల్లు వ్యాఖ్యానించారు.
By: Garuda Media | 23 Oct 2025 8:26 PM ISTవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై రౌడీ షీట్ తెరుస్తారా? .. ఇది సాధ్యమేనా? ఆ దిశగా సర్కారు ప్రయత్నిస్తోందా? అంటే.. రాజకీయాల్లో దీనిపైనే భారీ స్థాయిలో చర్చ సాగుతోంది. తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర దీనికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారన్నది టీడీపీ నేతల మధ్య సాగుతున్న చర్చ. పేర్ని నాని అన్ని హద్దులు దాటేశారని.. ఇక, ఊరుకునేది లేదని గట్టి సమాధానం పోలీసుల నుంచే వస్తుందని కొల్లు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని, కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక పేర్ని నాని ఇష్టమొచ్చినట్లు వాగుతున్నారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ప్రజల్ని, వ్యాపారుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాను తప్ప మరెవరూ ఉండకూడదు అనేలా పేర్ని నాని వ్యవహరిస్తున్నారని, మచిలీపట్నం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెదశింగు లక్ష్మణరావును రాజకీయంగా సమాధి చేసేందుకు అతని కుమారుడికి కౌన్సిలర్ టికెట్ ఇప్పించి, అతనికి వ్యతిరేకంగా పావులు కదిపి ఓడించారన్నారు.
1999లో నడకుదిటి నరసింహరావు మంత్రిగా ఉన్నపుడు అనేక రకాలుగా వేధించారన్నారు. తర్వాత నన్ను తప్పుడు కేసులో ఇరికించి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారన్నారు. పేర్ని నాని 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా తండ్రి, తాత గారు 1950 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల్ని అసైన్డ్ భూములు అని ప్రచారం చేసి కొట్టేయాలని ప్రయత్నిస్తే.. మేము తాడో పేడో అన్నట్లు పోరాడి సాధించుకున్నామన్నారు. 2014లో ఎన్నికలకు ముందు నాపై ఇన్ కం ట్యాక్స్ తో సోదాలు నిర్వహించి వేధించారన్నారు.
పేదల భూముల్ని బలవంతంగా లాక్కోవడంలో పేర్ని నాని నిష్ణాతుడని, 1985లో మా అన్నయ్య పెళ్లికి తిరుపతి వెళ్తే.. పేర్ని కృష్ణమూర్తి నాటి మున్సిపల్ ఛైర్మన్ బలగం పీతాంబరేశ్వరరావుకు చెందిన 440 గజాల భూమిని బలవంతంగా లాక్కున్నారన్నారు. 1997లో జిల్లా ఏడీజే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు రాగానే హైకోర్టుకు వెళ్లి వేధింపులకు పాల్పడ్డారన్నారు. ఇలా.. మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు.. ఆ వెంటనే జిల్లా ఎస్పీతో రహస్యంగా ఆయన మంతనాలు సాగించారని వార్తలు రావడంతో పేర్నిపై రౌడీషీట్ తెరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్న చర్చ సాగుతోంది. మరి ఇది నిజమే అయితే.. రాజకీయంగా మచిలీపట్నంలో మరింత రచ్చ జరగడం ఖాయమన్న వాదనా వినిపిస్తోంది.
