Begin typing your search above and press return to search.

షర్మిల కుమార్తె పెళ్లికి జగన్ శత్రువులే వస్తారు: మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహంపై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   30 Oct 2026 6:28 PM IST
షర్మిల కుమార్తె పెళ్లికి జగన్ శత్రువులే వస్తారు: మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
X

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహంపై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో షర్మిల తన కుమార్తె పెళ్లి నిర్వహించాలనుకోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభ్యంతరం తెలపడం వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన స్పష్టం చేశారు. ఆ పెళ్లికి వచ్చే వారంతా జగన్ శత్రువులేనని, అలాంటి పరిస్థితుల్లో యలహంక ప్యాలెస్‌లో వివాహం జరిపితే ఆయనకు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

గత కొద్దిరోజులుగా అంజలీరెడ్డి వివాహంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యలహంకలోని తన నివాసంలో కుమార్తె వివాహం చేయాలని షర్మిల భావించగా, ఆ ఇల్లు తనదంటూ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ షర్మిలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుండగా, తన బాస్ ను వెనకేసుకువచ్చేలా మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగా వాదిస్తున్నారు. గతవారం మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి పేర్ని నాని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అగ్గిరాజేశాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మరోసారి షర్మిల ఇంట్లో జరగనున్న పెళ్లిపై కామెంట్స్ చేయడం తీవ్ర దుమారం రేపే అవకాశం ఉందని అంటున్నారు.

బెంగళూరులోని యలహంకలో జగన్, షర్మిల నివాసాలు ఒకే కాంపౌండులో ఉన్నాయని, గతంలో అన్నాచెల్లెళ్ల మధ్య బంధాలు బాగున్నప్పుడు సరిహద్దులు లేకుండా ఇల్లు కట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో షర్మిల అక్కడ కుమార్తె పెళ్లి జరిపితే, ఆ వేడుకకు జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థులు, శత్రువులే ఎక్కువగా హాజరవుతారని నాని పేర్కొన్నారు. జగన్ నాశనాన్ని కోరుకునే వారు ఆ ప్రాంగణానికి వస్తే ఆయన ప్రాణ రక్షణకు, గోప్యతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే యలహంకలో పెళ్లికి అనుమతించడం లేదని చెప్పుకొచ్చారు.

పీసీసీ చీఫ్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం అమెరికాకు చెందిన రఘురామ్ రెడ్డితో నిశ్చయమైంది. నవంబర్ 25న పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే శుభలేఖల పంపిణీ కూడా ప్రారంభమైంది. తొలుత బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌నే ప్రధాన వేదికగా భావించినప్పటికీ, సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అక్కడ వేడుకలు జరపడం కుదరదని మాజీ సీఎం జగన్ రెడ్డి లేఖ ద్వారా తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. జగన్ భద్రతాపరమైన అభ్యంతరాలు తెలపడం, దానికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతలు వరుసగా ప్రకటనలు చేస్తుండటంతో షర్మిల ప్రత్యామ్నాయ వేదిక అన్వేషణలో పడినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసం లేదా ఇతర ప్రధాన కన్వెన్షన్ హాల్స్‌లో వివాహ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, గతంలో జగన్ మేనల్లుడు మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ సమయం నుంచి అంజలి రెడ్డి వివాహ వేదిక వరకు అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలే ప్రధాన ప్రచారాస్త్రంగా మారడంపైనే విస్తృత చర్చ జరుగుతోందని అంటున్నారు.