బందరులో పొలిటికల్ హీట్.. పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
వైసీపీ నగర శాఖ అధ్యక్షుడు మేకల సుబ్బన్న అరెస్టుకు నిరసనగా పోలీసుస్టేషన్ కు వచ్చిన మాజీ మంత్రి నాని ఆర్.పేట సీఐపై వాగ్వాదానికి దిగారు.
By: Tupaki Political Desk | 10 Oct 2025 7:32 PM ISTమాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం పోలీసులపై ఉగ్రరూపం ప్రదర్శించారు. వైసీపీ నగర శాఖ అధ్యక్షుడు మేకల సుబ్బన్న అరెస్టుకు నిరసనగా పోలీసుస్టేషన్ కు వచ్చిన మాజీ మంత్రి నాని ఆర్.పేట సీఐపై వాగ్వాదానికి దిగారు. పోలీసులు తమ పార్టీ వారిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఆదేశాల ప్రకారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా మచిలీపట్నం కళాశాల వద్ద పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. అయితే ఈ ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు కేసులు నమోదు చేశారు.
మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు దిగిన పేర్ని నానితోపాటు 400 మంది వైసీపీ కార్యకర్తలకు 41ఏ నోటీసులను పోలీసులు జారీ చేశారు. అయితే పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం చెప్పొద్దని పార్టీ నగర శాఖ అధ్యక్షుడు మేకల సుబ్బన్న వాట్సాప్ లో మెసెజ్ చేసినట్లు పోలీసుల ద్రుష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఆయనను స్టేషన్ కు పిలపించిన ఆర్.పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకుని పోలీసుస్టేషన్ కి వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులపై ఒంటికాలిపై లేచారు. సీఐతో ఆయన పరుషంగా మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది.
మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలు పోలీసుస్టేషన్ కు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో సెక్షన్ 30 అమలులో ఉందని చెప్పి, ప్రతిపక్షం గొంతునొక్కుతున్నారని నాని ఆరోపించారు. అంతేకాకుండా పోలీసులు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు సుబ్బన్న ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు నాని.
కాగా, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడినా సీఐ మాత్రం ఎంతో ఓపిగా ఆయన మాట్లాలను వినడం వీడియోల్లో కనిపించింది. కొన్ని అంశాలపై సీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మాజీ మంత్రి మాత్రం అసలు తగ్గేదేలే అన్నట్లు పోలీసులపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ‘‘మేం వేసిన రిమాండ్ ను రిజెక్ట్ చేసే ధైర్యం కోర్టులకు ఉందా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టు చేసి 10 రోజులు లోపల వేస్తామంటూ బెదిరిస్తున్నారు. కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు తీరు మార్చుకోవడం లేదు’’ అంటూ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులపై పోరాడతామంటూ తేల్చిచెప్పారు. ఈ ప్రభుత్వం మీదేనని రౌడీలను పోలీసులు బ్రతిమాలుతున్నారు. మా పార్టీ వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారని ఆరోపించారు నాని.
