భారత్ లో చైనా టార్గెట్ ఇదే... పెంటగాన్ నివేదికలో షాకింగ్ విషయాలు!
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇటీవల చైనాలోని షాంఘై ఎయిర్ పోర్ట్ లో భారత మహిళ వాంగ్ జోమ్ థాంగ్ డోక్ కు వేధింపులు ఎదురైన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 25 Dec 2025 5:00 PM ISTఅరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇటీవల చైనాలోని షాంఘై ఎయిర్ పోర్ట్ లో భారత మహిళ వాంగ్ జోమ్ థాంగ్ డోక్ కు వేధింపులు ఎదురైన సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్.. చైనా భూభాగం అంటూ చైనీస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను వేధించిన విషయం సంచలనంగా మారింది. అయితే అదేదో పొరపాటునో గ్రహపాటునో జరిగిన విషయం కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో చైనా వైఖరిపై పెంటగాన్ ఓ సంచలన నివేదిక విడుదల చేసింది.
అవును... భారత్ ను చుట్టుముట్టేందుకు చైనా తన వ్యూహాలకు మరింత పదును పెడుతోందని.. ఇందులో భాగంగా.. ఓ వైపు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తన వైఖరిపై వ్యూహాలు రచిస్తూ.. మరో వైపు పాక్ ను భారత్ పైకి ఉసిగొల్పుతూ చైనా ఆలోచనలు అమలు చేస్తోందని అంటున్నారు. ఈ సమయంలోనే బంగ్లాతో సైనిక ఒప్పందం గురించి పాక్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే చర్చా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజాగా విడుదల చేసిన 'మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్స్ - 2025' నివేదికలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా.. తూర్పు లడఖ్ లోని ఎల్.ఏ.సి వెంబడి ఏళ్ల తరబడి ఉన్న సరిహద్దు ప్రతిష్టంభనకు భారత్ - చైనా ముగింపు పలికి ఉండవచ్చు, కానీ రాబోయే కాలంలో మరొకటి తలెత్తే అవకాశం ఉందని.. తైవాన్ తో పాటు తన "ప్రధాన ప్రయోజనాల"లో అరుణాచల్ ప్రదేశ్ పై చైనా తన వాదనలు వినిపిస్తోందని పేర్కొంది.
చాలాకాలంగా.. బీజింగ్ అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో భాగమని పేర్కొంటూ.. ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ లేదా జాంగ్నాన్ అని పిలుస్తోంది. ఎందుకంటే.. 1914లో బ్రిటిష్ వారు గీసిన మెక్ మహాన్ రేఖను చైనా అంగీకరించదు. తొలుత.. మొత్తం అరుణాచల్ లో తవాంగ్ చైనాకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పేది. వాస్తవానికి.. గతంలో చైనా తవాంగ్ పై మాత్రమే దావా వేసింది. తరువాత, అది మొత్తం ఈశాన్య రాష్ట్రానికి దావాను విస్తరించింది.
అప్పటి నుండి భారతదేశంపై ఒత్తిడి పెంచడానికి చైనా అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రదేశాలకు కొత్త పేర్ల జాబితాలను కాలానుగుణంగా విడుదల చేస్తోంది. మరోవైపు... తవాంగ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు భారత సైన్యం కూడా రికార్డు స్థాయిలో ఆయుధాలను, బలగాలను మోహరించింది.
పాక్ తో చైనా వ్యూహాం!:
అమెరికా తాజా నివేదిక ఈ సందర్భంగా మరో విషయాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా.. భారత్ ఎదుగుదలను అడ్డుకోవడానికి చైనా తన మిత్రదేశం పాకిస్థాన్ ను ఆయుధశాలగా మారుస్తోందని తెలిపింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందుర్ సమయంలో ఇది విస్తృతంగా కనిపించిందని తెలిపింది. చైనా ఇప్పటికే పాకిస్థాన్ కు 36 జే-10సీ ఫైటర్ జెట్లను సరఫరా చేసింది. వీటిని పాక్ ఇటీవల భారత సరిహద్దుల్లో మోహరించింది.
ఇదే సమయంలో.. ఎల్.ఏ.సీ. వెంబడి ప్రశాంతతను కాపాడుకోవడం ద్వారా చైనా, భారతదేశంతో సంబంధాలను స్థిరీకరిస్తోందని.. మరోవైపు వాషింగ్టన్ కు ఢిల్లీ దగ్గరగా వెళ్లకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తోందని కూడా ఆ నివేదిక పేర్కొంది.
ఏమిటి మెక్ మహాన్ రేఖ..?
మెక్ మహాన్ రేఖ చైనా ఆక్రమిత తూర్పు-హిమాలయ ప్రాంతం, భారత ప్రాంతాల మధ్య సరిహద్దును సూచిస్తుంది. ఈ ప్రాంతం ఎత్తైన పర్వత ప్రాంతం. ఈ రేఖను బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అప్పటి విదేశాంగ కార్యదర్శి సర్ హెన్రీ మెక్ మహాన్ నిర్ణయించారు. అందుకే దీనిని ఆయన పేరు మీదుగా మెక్ మహాన్ రేఖ అని పిలుస్తారు. ఈ రేఖ పొడవు 890 కిలోమీటర్లు. అయితే చైనా ఈ రేఖను అంగీకరించదు.
