పెంటగాన్ లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఈసారి అమెరికా ఏం చేస్తుందో?
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని పెంటగాన్ పరిసరాల్లో ఒక్కసారిగా పెరిగిన పిజ్జా ఆర్డర్లు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి.
By: A.N.Kumar | 27 March 2026 11:44 PM ISTఅక్కడ చీజ్ మెల్ట్ అవుతుంటే.. ఇక్కడ దేశాల గుండెలు లయ తప్పుతున్నాయి! అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పిజ్జా ఆర్డర్లు వందల శాతం పెరిగాయంటే, ఏదో 'పెద్ద ఆపరేషన్' కుతకుతలాడుతోందన్నట్టేనా? ఆకలి తీర్చే పిజ్జా.. ఆయుధాల కదలికకు సంకేతమా? వాషింగ్టన్‌లోని పెంటగాన్ పరిసరాల్లో అనూహ్యంగా పెరిగిన ఫుడ్ డెలివరీలు ఇప్పుడు అంతర్జాతీయ విశ్లేషకులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పశ్చిమాసియా సెగలు పుడుతున్న వేళ, ఈ 'పిజ్జా ఇండెక్స్' ఏ తుపానుకు ముందు వచ్చే నిశ్శబ్దమోనన్న ఆందోళన మొదలైంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని పెంటగాన్ పరిసరాల్లో ఒక్కసారిగా పెరిగిన పిజ్జా ఆర్డర్లు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. సాధారణంగా ఇది చిన్న విషయంగా కనిపించినప్పటికీ గత అనుభవాల నేపథ్యంలో దీనిని కొందరు విశ్లేషకులు కీలక పరిణామాలకు సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల హర్మూజ్ జలసంధి అంశంపై ఇరాన్‌కు ఇచ్చిన గడువును అమెరికా మరో పది రోజులు పొడిగించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో అమెరికా అదనపు సైనిక బలగాలను పశ్చిమాసియాకు పంపే యోచనలో ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెంటగాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పిజ్జా ఆర్డర్లు అనూహ్యంగా పెరగడం గమనార్హంగా మారింది.
స్థానికంగా ఫుడ్ డెలివరీల్ని ట్రాక్ చేసే ఒక వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం పాపా జాన్స్‌లో 296 శాతం, డొమినోస్‌లో 208 శాతం, పిజాటోలో 200 శాతం మేర ఆర్డర్లు పెరిగాయి. ఈ సమాచారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వైరల్‌గా మారడంతో "పెంటగాన్ పిజ్జా థియరీ" మళ్లీ చర్చలోకి వచ్చింది.
ఈ సిద్ధాంతం ప్రకారం.. అమెరికా సైన్యం కీలక ఆపరేషన్లకు సిద్ధమవుతున్నప్పుడు లేదా అత్యవసర సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారులు రాత్రంతా కార్యాలయాల్లోనే ఉండాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో వారు త్వరగా అందుబాటులో ఉండే ఫుడ్ డెలివరీలపై ఆధారపడతారు. అందుకే పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు అకస్మాత్తుగా పెరగడం ఒక సంకేతంగా భావించబడుతోంది.
ఇది కొత్త విషయమేమీ కాదు. 1970ల కాలంలో సోవియట్ గూఢచార సంస్థలు అమెరికా సైనిక కదలికలను అంచనా వేయడానికి రాత్రివేళ ఫుడ్ డెలివరీల ధోరణులను పరిశీలించేవని చరిత్ర చెబుతోంది. అంతేకాక గతంలో వెనెజువెలాపై అమెరికా సైనిక చర్యల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు నమోదయ్యాయని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
అయితే ఈ "పిజ్జా థియరీ"కి పక్కా శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం అనుభవాల ఆధారంగా ఏర్పడిన ఒక అభిప్రాయం మాత్రమేనని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో జరిగే సున్నిత పరిణామాల దృష్ట్యా ఇలాంటి చిన్న సూచనలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
మొత్తానికి, పెంటగాన్ వద్ద పెరిగిన పిజ్జా ఆర్డర్లు నిజంగా ఏదైనా పెద్ద సైనిక చర్యకు సంకేతమా? లేక కేవలం యాదృచ్ఛికమా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కానీ ఈ పరిణామం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించడం ఖాయం.
