Begin typing your search above and press return to search.

భయపడుతున్న ట్రంప్!

పరువు పోయిందనే తీవ్ర వేదనతో రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌లోని 'జాయింత్‌ స్టాఫ్‌' విభాగంపై ప్రభుత్వం కన్నుపడింది.

By:  A.N.Kumar   |   6 Sept 2026 8:47 AM IST
భయపడుతున్న ట్రంప్!
X

అగ్రరాజ్యం అమెరికాకు మళ్ళీ కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఈసారి శత్రువుల నుంచి కాదు.. అంతర్గతంగా ఊడుతున్న 'లీకుల' నుంచి.. ఇరాన్‌తో యుద్ధం సంగతేమో గానీ తమ దగ్గర ఆయుధాల నిల్వలు అడుగుంటిపోతున్నాయన్న పచ్చి నిజం కాస్తా మీడియా ముందుకు రావడంతో శ్వేతసౌధం వర్గాల్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏకంగా డోనాల్డ్ ట్రంప్ సర్కారుకు చెమటలు పట్టేసరికి పెంటగాన్ లోపల పెద్ద ఎత్తున 'శోధన' పర్వం మొదలైంది.

పరువు పోయిందనే తీవ్ర వేదనతో రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌లోని 'జాయింత్‌ స్టాఫ్‌' విభాగంపై ప్రభుత్వం కన్నుపడింది. అక్కడ పనిచేసే ఓ 50 మంది సైనిక అధికారులు, సిబ్బందిని లైన్లో నిలబెట్టి విచారణ మొదలుపెట్టారు. ఊరికే ప్రశ్నిస్తే నిజాలు చెబుతారా ఏంటి? అందుకే ఏకంగా 'పాలిగ్రాఫ్' లై డిటెక్టర్ పరీక్షలను రంగంలోకి దింపేశారు.

పల్స్ ఎంత కొట్టుకుంటోంది.. గుండె వేగం పెరిగిందా.. నుదుటిపై చెమటలు పడుతున్నాయా అంటూ ఆ పరికరాల ముందర కూర్చోబెట్టి అధికారులను చెమటలు పట్టిస్తున్నారు. ప్రపంచాన్నంతటినీ తన మునివేళ్లపై శాసించగలమని గొప్పులు చెప్పుకునే అగ్రరాజ్యం, ఇప్పుడు తమ సొంత ఆఫీసులోనే 'ఎవడ్రా ఆ లీకూ?' అని డిటెక్టివ్ గేమ్‌ ఆడుతుండటం చూస్తుంటే నవ్వాలో లేక జాలిపడాలో తెలియని పరిస్థితి.

అసలు కథేంటంటే.. యుద్ధంలో అమెరికా క్షిపణులు ఎంత వేగంగా ఖాళీ అవుతున్నాయో తమ సైనిక సామర్థ్యం ఎంతలా తగ్గిపోతుందో అనే గుట్టు రట్టయింది. ఈ సున్నితమైన సమాచారం ప్రత్యర్థుల చేతికి చిక్కితే తమ 'భయానక' ఇమేజ్ ఎక్కడ మసకబారుతుందో అని వాషింగ్టన్ పెద్దలు విలవిలలాడిపోతున్నారు.

మరోవైపు పెంటగాన్ అధికార ప్రతినిధులు మాత్రం "మేము అంతర్గత విషయాలపై మాట్లాడం" అంటూ యథాతథంగా తుస్సుమనిపించే గంభీర ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారు. "మా దగ్గర రహస్యాలు చాలా భద్రం" అని పైకి చెబుతున్నా లోపల మాత్రం 50 మందికి పాలిగ్రాఫ్‌ వైర్లు తగిలించి ఉక్కపోత పోయిస్తున్నారు.

ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఏం జరిగినా పసిగడతామని లెక్చర్లు ఇచ్చే అమెరికా తమ పెంటగాన్ భవనం గోడల మధ్య నుంచి సమాచారం బయటకు ఎలా దూకేసిందో తెలుసుకోవడానికి లై డిటెక్టర్ల మీద ఆధారపడటం ఈ ఏడాదికే పెద్ద కామెడీ సర్కస్.. దర్యాప్తు పూర్తయ్యేసరికి ఎంతమంది 'సత్యవంతులు' దొరుకుతారో చూడాలి..