అగ్రరాజ్యంలో పేలిన గన్.. ఈసారి ముగ్గురు పోలీసులు మృతి
గన్ కల్చర్ పుణ్యామా అని ఇష్టారాజ్యంగా మోగే కాల్పులకు అమాయకులు బలి అవుతుంటారు.
By: Garuda Media | 18 Sept 2025 10:33 AM ISTఅగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గన్ కల్చర్ పుణ్యామా అని ఇష్టారాజ్యంగా మోగే కాల్పులకు అమాయకులు బలి అవుతుంటారు. విషాద ఘటనలు చోటు చేసుకున్నప్పుడు గన్ కల్చర్ గురించిన నాలుగు మాటలు మాట్లాడటటం.. మళ్లీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని కారణంగా తరచూ ఏదో ఒక విషాద ఉదంతం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈసారి ముగ్గురు పోలీసులు ఈ కాల్పులకు బలి కాగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. పెన్సిల్వేనియాలోని ఉత్తర కొడోరస్ టౌన్ షిప్ లో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది.
ఒక ఇంట్లో తగదా జరిగినట్లుగా కంప్లైంట్ రావటంతో అక్కడకు పోలీసులు వెళ్లారు. అయితే.. పోలీసులపై అమానుషంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఫిలడెల్ఫియాకు పశ్చిమాన సుమారు 115 మైళ్ల దూరంలో ఉన్న టౌన్ షిప్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కాల్పులకు తెగ పడిన నిందితుడి వివరాలు బయటకురాలేదు. అదే సమయంలో మరణించిన పోలీసులు ఏ విభాగానికి చెందిన వారన్న దానిపైనా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ కాల్పుల ఉదంతంపై పెద్ద ఎత్తున విచారణ మొదలైంది. దీంతో.. వివరాల్ని పూర్తిగా వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత వెల్లడించనున్నట్లుగా పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసు కమిషనర్ క్రిస్టఫర్ పారిస్ ప్రకటించారు.
పారదర్శక విచారణ చేపట్టి.. కాల్పులకు దారి తీసిన కారణాల్ని కనుగొనే వరకు తాము పని చేస్తూనే ఉంటామన్నారు. ఈ ఉదంతం తమకు భరించలేనంత విషాదాన్ని మిగిల్చినట్లుగా పేర్కొన్నారు. ఈ ఉదంతంపై గవర్నర్ జాష్ షెపిరీ కూడా స్పందించారు మరణించిన కుటుంబాలకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఈ ఉదంతంలో విచారణ కోసం గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. ఘటనాస్థలంలోకి ఎవరూరాకుండా ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున వాహనాల్ని మొహరించారు. ఈ కాల్పులకు కారణమైన దుండగుడ్ని సైతం పోలీసులు అక్కడిక్కడే కాల్చేశారు. అయితే..దుండగుడి వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈకాల్పులు జరిగాయన్న దానిపై పోలీసులు ఫోకస్ చేశారు.
