'రాక్షసి'... చనిపోయినా ఈ చైనా మహిళను ఎందుకు తిట్టుకుంటున్నారు..!
ఆమె మరణించిన అనంతరం... ఆమెను జనాభా విధానం, మహిళలు, పిల్లల సమస్యలను పరిష్కరించడంలో అత్యుత్తమ నాయకురాలిగా చైనా కమ్యునిస్టు పార్టీ అభివర్ణించింది.
By: Raja Ch | 26 Dec 2025 1:00 AM ISTసాధారణంగా ఎంత దుర్మారులు, ఎంత కఠినాత్ములు, ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టినవారు మరణించినా.. చాలా మంది వారి గురించి చెడుగా మాట్లాడరు.. చనిపోయిన వారి గురించి ఎందుకులే అని అంటుంటారు. కానీ.. చైనాలో మాత్రం ఇటీవల చనిపోయిన పెంగ్ పెయున్ అనే మహిళను మాత్రం.. రాక్షసి అని, నీచమైన స్త్రీ అని, దుష్టురాలు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు చైనా ప్రజానికం. అందుకు ఓ బలమైన, కీలకమైన కారణం ఉంది మరి!
అవును... 1980 - 2015 మధ్య క్రూరమైన విధానాన్ని అమలు చేసే బాధ్యతను స్వీకరించిన పెంగ్ పెయున్ అనే మహిళ డిసెంబర్ 21న బీజింగ్ లో మరణించారు. ఈ సమయంలో.. ఆమె మరణం జనాభా నియంత్రణ చర్యలపై మానినట్లు కనిపించిన పాత గాయాలను మళ్లీ రేపిందని అంటున్నారు. దీంతో... నీచమైన స్త్రీ, ప్రపంచ స్థాయి రాక్షసి, దుష్టురాలు, ఆమె ఎప్పుడూ నరకంలోనే ఉండాలి అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు చైనీయులు.
ఆమె మరణించిన అనంతరం... ఆమెను జనాభా విధానం, మహిళలు, పిల్లల సమస్యలను పరిష్కరించడంలో అత్యుత్తమ నాయకురాలిగా చైనా కమ్యునిస్టు పార్టీ అభివర్ణించింది. అయితే.. వివాదాస్పద జనాభా నియంత్రణ సమయంలో తల్లులు ఎదుర్కొన్న బాధ మరో వైపు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా.. 'నిన్న రాక్షసి చనిపోయింది.. ఆమె 10 ఏళ్ల నాయకత్వ కాలంలో కోట్లాది మందికి ప్రభుత్వం బలవంతంగా గర్భస్రావాలు చేసింది' అని పోస్టులు వెలిశాయి.
వివాదాస్పదమైన వన్ చైల్డ్ పాలసీ!:
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా ఉన్న సమయంలో.. ఆ దేశం 1980లో ఒక విడ్డ విధానాన్ని (వన్ చైల్డ్ పాలసీ) తెరపైకి వచ్చింది. ఆ బాధ్యతను పెంగ్ పెయున్ కి అప్పగించారు. అయితే.. ఈ పాలసీ కాలంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు బలవంతంగా గర్భస్రావాలు, స్టెరిలైజేషన్ లను భరించారని.. దీన్ని వ్యతిరేకించే వారిని స్థానిక అధికారులు కొట్టారని.. లింగ ఎంపిక గర్భస్రావాలు, శిశుహత్యల కారణంగా సుమారు 20 మిలియన్ల మంది ఆడపిల్లలు ఆ కాలంలో అదృశ్యమయ్యారని నివేదికలు చెబుతున్నాయి.
అయితే దీనికంతటికీ పెంగ్ పెయునే కారణమని చైనా ప్రజల్లో ఆగ్రహం అలా ఉండిపోయింది.. వారి హృదయాల్లో నిక్షిప్తమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణం వారి పాత గాయాలను మళ్లీ రేపింది! ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోస్టులు ఆమెపై చైనా ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు.
ఇందులో భాగంగా... "నీ హయాంలో ఈ ప్రపంచంలోకి రాకుండా అదృశ్యమైన పిల్లలు నగ్నంగా, మరణానంతర జీవితంలో మీ కోసం అక్కడ వేచి ఉన్నారు" అని ఒక వినియోగదారుడు పోస్ట్ చేయగా... "ఈ నీచమైన స్త్రీని అందరూ గుర్తుంచుకోవాలి! మీ పుట్టబోయే సోదరులు, సోదరీమణుల ఆత్మలు ఆమెను ఎప్పటికీ క్షమించవు" అని మరొక వినియోగదారుడు.. "పెంగ్ పెయున్ చేతులపై కోట్లాది మంది నవజాత శిశువుల రక్తం ఉంది" అని ఇంకో వినియోగదారుడు స్పందించారు.
