ఉద్యమ సహచరితో ప్రేమ.. ఎమ్మెల్యే అయ్యాకే పెళ్లి అన్న సుదర్శన్ రెడ్డి..
తెలంగాణ ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.
By: Tupaki Political Desk | 31 July 2026 4:21 PM ISTతెలంగాణ ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. 52 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆయన రాజకీయాల్లో దాదాపు మూడు దశాబ్దాలు కొనసాగారు. అతి చిన్నవయసులో రాజకీయాల్లోకి వచ్చిన సుదర్శన్ రెడ్డిని మావోయిస్టులు టార్గెట్ చేశారు. దీంతో ఆయనకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇద్దరు గన్ మన్లను కేటాయించింది. అప్పుడు ఆయన వయసు కేవలం 22 ఏళ్లే కావడం గమనార్హం. తొలుత కాంగ్రెస్ లో పనిచేసిన సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చురుకైన ఉద్యమకారుడిగా కొద్దికాలంలోనే గుర్తింపు చెచ్చుకోవడమే కాకుండా ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా ఎదిగారని చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ రెడ్డి వివాహం వెనుక కథ తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేగా గెలిచే వరకు వివాహం చేసుకోనని ఆయన ప్రతినబూనారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నచ్చజెప్పడంతో 2016లో ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య స్వప్న కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా, జడ్పీటీసీగా సేవలందించారు. ఉద్యమ తీవ్రతలో వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పణంగా పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డికి తెలంగాణ పోరాటంలోనే స్వప్న పరిచయం అయ్యారు. ఉద్యమంలోనే సుదీర్ఘకాలం కలిసి ప్రయాణించడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహంతో ఒక్కటయ్యారు. అయితే, ఎమ్మెల్యే అయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని సుదర్శన్ రెడ్డి పంతం పట్టగా, పార్టీ పెద్దలు కల్పించుకుని ఆయనకు వివాహం జరిపించడం విశేషంగా చెబుతున్నారు. మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలవంతంతో 2016లో క్యాబినెట్ హోదాలో సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో ఉండగా పెద్ది సుదర్శన్ రెడ్డి, స్వప్న వివాహం జరిగింది. ఈ వివాహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారని గుర్తు చేసుకుంటున్నారు.
పార్టీలో అత్యున్నత విశ్వాసం..
సీనియర్ నేతలు కడియం శ్రీహరి, కొండా మురళి వంటి ఎంతోమంది బీఆర్‌ఎస్‌లోకి వచ్చినా, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాటనే అధినేత కేసీఆర్ పరిగణనలోకి తీసుకునేవారని అంటున్నారు. సుదర్శన్ రెడ్డి అంటే కేసీఆర్ కు అచంచలమైన నమ్మకమని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. పార్టీలో కేటీఆర్, హరీశ్‌రావులతో సమానమైన స్థానం సుదర్శన్ రెడ్డికి ఇచ్చారని కూడా చెబుతున్నారు.
కరోనా కష్టకాలంలో మానవతా హస్తం
కేవలం రాజకీయం, ఉద్యమాలే కాకుండా మానవతా దృక్పథానికి పెద్ది సుదర్శన్ రెడ్డి నిలువుటెత్తు నిదర్శనమని చెబుతున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే ఆయన, కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం, భోజన వసతి కల్పించారు.
ఒక సాధారణ కార్యకర్త నుంచి యూత్ కాంగ్రెస్, అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ ఉరుకుల పరుగుల ప్రస్థానంలో ఎన్నోసార్లు పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగాలకు గురై, వాటర్ కెనన్ దెబ్బకు కుడి కన్ను, కుడి కాలు శాశ్వత నొప్పులతో ఇబ్బంది పడుతున్నప్పటికీ... ప్రజా సేవలో మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. శాకాహారిగా, ఎలాంటి దురలవాట్లు లేకుండా, నిత్యం కఠినమైన వ్యాయామంతో క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడుపుతూ... కష్టకాలంలో పార్టీని వీడకుండా కేసీఆర్ వెన్నంటి నిలిచిన నమ్మకస్తుల జాబితాలో పెద్ది సుదర్శన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన అభిమానులు నివాళులర్పిస్తున్నారు.
