Begin typing your search above and press return to search.

కాఫీ తోట కూలీ నుంచి కార్పొరేట్ బాస్‌ వరకు.. అసలు ఎలా సాధ్యం?

పేదరికాన్ని జయించడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి ఉన్న ఏకైక శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే అని నిరూపించిన గొప్ప వ్యక్తి పి.సి. ముస్తఫా.

By:  Madhu Reddy   |   25 Aug 2026 11:33 AM IST
కాఫీ తోట కూలీ నుంచి కార్పొరేట్ బాస్‌ వరకు.. అసలు ఎలా సాధ్యం?
X

పేదరికాన్ని జయించడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి ఉన్న ఏకైక శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే అని నిరూపించిన గొప్ప వ్యక్తి పి.సి. ముస్తఫా. ఒకప్పుడు రోజుకు 10 రూపాయల కూలీ కోసం కాఫీ తోటల్లో పనిచేసిన ఆయన, ఆరో తరగతిలోనే ఫెయిల్ అయ్యారు. కానీ చదువు విలువ తెలుసుకుని పట్టుదలతో ముందుకు సాగి, నేడు వందల కోట్ల టర్నోవర్ సాధించే 'iD Fresh Food' సంస్థను స్థాపించారు. ఆయన సక్సెస్ జర్నీ ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకం!

పేదరికం, ఆరో తరగతిలో ఫెయిల్:

కేరళలోని వయనాడ్ జిల్లా చెన్నలొడె అనే చిన్న గ్రామంలో ముస్తఫా జన్మించారు. కనీసం విద్యుత్, రోడ్డు సదుపాయాలు లేని ఆ గ్రామంలో ఆయన తండ్రి కూలీగా పనిచేసేవారు. ఇక రోజుకు రూ. 10 సంపాదనతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరో తరగతిలో ఫెయిల్ అయిన ముస్తఫా, చదువు మానేసి తండ్రితో పాటు కూలీ పనికి వెళ్లారు. కానీ ఒక ఉపాధ్యాయురాలు ఆయన పరిస్థితిని చూసి, పుస్తకాలకు డబ్బులు ఇచ్చి మళ్లీ బడికి పంపించారు.

ఎన్‌ఐటీ, ఐఐఎమ్‌లలో ఉన్నత చదువులు:

టీచర్ ఇచ్చిన ప్రోత్సాహంతో కష్టపడి చదివిన ముస్తఫా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ఐఐఎమ్ బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మంచి జీతంతో ఉద్యోగం చేసినప్పటికీ, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఆయనను వ్యాపారం వైపు అడుగులు వేసేలా చేసింది.

రూ. 50 వేలతో మొదలైన 'iD Fresh Food':

తన కజిన్ షంషుద్దీన్ ఇచ్చిన ఆలోచనతో ఇడ్లీ, దోస పిండిని తాజాగా ప్యాకెట్లలో అమ్మాలని నిర్ణయించుకున్నారు. ముస్తఫా తన వద్ద ఉన్న రూ. 25,000 పొదుపు మొత్తాన్ని, కజిన్స్ సాయాన్ని కలిపి మొత్తం రూ. 50,000 లతో 550 చదరపు అడుగుల చిన్న గదిలో రెండు గ్రైండర్లు, ఒక మిక్సర్‌తో 'iD Fresh Food'ను ప్రారంభించారు. ఇక నాణ్యమైన పిండిని అందిస్తూ రోజుకు 100 ప్యాకెట్లు అమ్మడానికి ఎంతో పోరాడారు.

రూ. 680 కోట్ల వార్షికాదాయం, మైండ్ బ్లోయింగ్ గ్రోత్:

మొదట్లో అనేక కష్టాలు ఎదురైనా ముస్తఫా వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం 'iD Fresh Food' భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు వందకు పైగా నగరాల్లో విస్తరించింది. 2015-16లో రూ. 100 కోట్లుగా ఉన్న కంపెనీ టర్నోవర్, నిరంతర ఎదుగుదలతో FY25 నాటికి ఏకంగా రూ. 680 కోట్లకు చేరుకుంది. ఇక నేడు ఈ సంస్థ విలువ రూ. 4,450 కోట్లుగా ఉండగా, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.

ఓటమి ముగింపు కాదు:

"మన నేపథ్యం మన భవిష్యత్తును నిర్ణయించదు, అలాగే ఓటమి అనేది ప్రయాణానికి ముగింపు కాదు" అని ముస్తఫా యువతకు పిలుపునిస్తుంటారు. ఆరో తరగతిలో ఫెయిల్ అయిన ఒక సాధారణ గ్రామీణ కుర్రాడు.. ఐఐఎమ్‌లో చదివి వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించడమే చదువు ఇచ్చే అసలైన శక్తికి నిదర్శనం.