అజిత్ పవార్ చితి మంటలు ఆరకముందే ఎన్సీపీలో ‘కుర్చీ’ ఫైట్
మహారాష్ట్ర రాజకీయ యవనికపై శరద్ పవార్ అనే పేరు ఒక శకం. తన వేలిముద్ర లేనిదే రాష్ట్ర రాజకీయాల్లో ఏ నిర్ణయమూ జరగదని ప్రతీతి.
By: A.N.Kumar | 31 Jan 2026 4:14 PM ISTమహారాష్ట్ర రాజకీయ యవనికపై శరద్ పవార్ అనే పేరు ఒక శకం. తన వేలిముద్ర లేనిదే రాష్ట్ర రాజకీయాల్లో ఏ నిర్ణయమూ జరగదని ప్రతీతి. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అజిత్ పవార్ మరణం పవార్ కుటుంబంలో ఒక తీరని లోటును మిగిలిస్తే ఆ మరణం నుంచి కోలుకోక ముందే 'పదవుల వేట' మొదలవ్వడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. అజిత్ పవార్ చితి మంటలు ఆరకముందే ఆయన భార్య సునేత్ర పవార్‌ను డిప్యూటీ సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనే తొందరపాటు నిర్ణయాలు ఎన్సీపీలో మరోసారి చిచ్చు రేపాయి.
విస్మరించిన పెద్దరికం.. బహిర్గతమైన విభేదాలు
బారామతిలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తన తమ్ముడి కుమారుడు.. రాజకీయాల్లో తన వెంటే నడిచిన అజిత్ వారసుడి ఎంపిక విషయంలో శరద్ పవార్‌కు సమాచారం లేకపోవడం అంటే ఆయన పెద్దరికాన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. "మీడియా ద్వారానే తెలుసుకున్నాను" అని ఆయన అనడం వెనుక ఎంతటి వేదన, అసహనం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులను సంప్రదించకుండానే పదవుల పంపిణీ జరిగిపోవడం రాజకీయ స్వార్థానికి పరాకాష్ట.
అజిత్ కల.. చెదిరిన ఆశలు
అజిత్ పవార్ మరణానికి ముందు చీలిన పార్టీని మళ్లీ ఏకం చేయాలని, తన బాబాయ్ శరద్ పవార్‌కు పుట్టినరోజు కానుకగా పార్టీ విలీనాన్ని బహుమతిగా ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. ఆ కల నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. కానీ ఆయన ఆశయాలను గౌరవించాల్సింది పోయి, సానుభూతి పవనాలను వాడుకుని అధికారాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నాలు అజిత్ ఆత్మకు శాంతిని చేకూర్చవు. పార్టీని ఏకం చేయాలన్న చర్చలు పక్కన పెట్టి హడావుడిగా ప్రమాణ స్వీకారాలకు సిద్ధమవ్వడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.
సునేత్ర పవార్ ఎదుట సవాళ్లు
మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ చరిత్ర సృష్టించవచ్చు గానీ అది కుటుంబ కలహాల మధ్య జరుగుతున్న పట్టాభిషేకం అన్నది మరువకూడదు. ఒకవైపు శరద్ పవార్ అసంతృప్తి, మరోవైపు బీజేపీ రాజకీయ వ్యూహాలు ఆమెను ఊపిరి ఆడనివ్వకుండా చేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో అజిత్ వర్గం వైఫల్యం తర్వాత, ఇప్పుడు బీజేపీ సునేత్రను కేవలం ఒక పావులా వాడుకుంటుందా లేక నిజమైన అధికారం కట్టబెడుతుందా అన్నది సందేహమే.
రాజకీయాల్లో వారసత్వం సహజమే కానీ.. అది విలువలతో కూడినదై ఉండాలి. చావు ఇంట్లో పదవుల పండగ చేసుకోవడం సభ్య సమాజానికి మంచి సందేశం ఇవ్వదు. పవార్ కుటుంబం తన వ్యక్తిగత వైషమ్యాలను పక్కన పెట్టి అజిత్ పవార్ ఆశించిన 'ఐక్యత' దిశగా అడుగులు వేయకపోతే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ మలుపు ఎన్సీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే ప్రమాదం ఉంది.
