ఎన్డీయేలోకి విజయ్ - పవన్ సంచలన వ్యాఖ్యలు
తమిళ దళపతికి జన సేనాని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన రాజకీయానికి సుస్వాగతం పలికారు అంతే కాదు యువ నాయకుడు అని కితాబు ఇచ్చారు.
By: Satya P | 18 March 2026 9:19 AM ISTతమిళ దళపతికి జన సేనాని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన రాజకీయానికి సుస్వాగతం పలికారు అంతే కాదు యువ నాయకుడు అని కితాబు ఇచ్చారు. విజయ్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అదే సమయంలో ఆయన ఎన్డీయేలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని కూడా అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక తమిళ చానల్ కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇపుడు తెలుగు తమిళ రాష్ట్రాలలో తెగ వైరల్ అవుతోంది. ఆదివారం ప్రసారం అయిన ఈ ఇంటర్వ్యూ సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో వేడిని మరింతగా రాజేసింది. ఇక ఈ సందర్భంగా యాంకర్ అడిగిన అనేక ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఏ మాత్రం తడుముకోకుండా జవాబులు చెప్పడం విశేషం.
విజయ్ కి భారీ ఆఫర్ వెనక :
ఇదిలా ఉంటే టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ కి 80 అసెంబ్లీ సీట్లు అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని ఎన్డీయే తరఫున తాను ఆఫర్ చేశాను అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. ఇది పూర్తిగా అవాస్తవం అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా సలహా సూచనలతో తాను ఈ విధంగా రాయబారం చేసినట్లుగా వస్తున్న వార్తలు అన్నీ కూడా నిరాధారం అని ఆయన అన్నారు. తాను నిజానికి విజయ్ ని కలసి ఇరవై ఏళ్ళు దాటుతోంది అని పవన్ స్పష్టం చేశారు. అదే సమయంలో యువ నాయకుడిగా దేశానికి సేవ చేయాలన్న తపనతో ఉంటే కనుక ఎన్డీయేలో విజయ్ చేరాలని ఆయన కోరారు అంతే కాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చినందుకు పార్టీ పెట్టినందుకు వెల్ కం అని చెప్పారు. జాతీయ దృక్పధంతో రాజకీయాలు చేయాలని ఆయన సూచించారు.
ఎవరి రోల్ మోడల్ వారిదే :
రాజకీయాల్లో ఎన్టీఆర్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎవరు మోడల్ కరెక్ట్ అన్న దానికి పవన్ బదులిస్తూ ఎవరి మోడల్ వారిదే అన్నారు నాయకుడు అన్న వారు తనకంటూ ఒక సొంత మోడల్ ని క్రియేట్ చేసుకోవాలని పవన్ అన్నారు. అంతే కాదు ఏపీలో అయితే కూటమి పార్టీల రాజకీయం సక్సెస్ అయింది అని గుర్తు చేశారు. తమిళనాడులో కూడా ఎన్డీయే పాలన రావాల్సి ఉందని అన్నారు. ఇక సనాతన వాఎదాన్ని అంతా బలంగా నమ్మాలని అంటూ ద్రవిడ వాదం విషయంలో తమిళనాడులో ఉన్న ఫిలాసఫీ మీద ఆయన పరోక్షంగా అలా స్పందించారు అంటున్నారు. సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మికతను విస్మరించకూడదని అన్నారు. ద్రవిడ రాజకీయాల్లో మార్పు రావాల్సిందని పవన్ గట్టిగా చెప్పడం విశేషం.
తమిళనాట ప్రచారం :
ఇదిలా ఉంటే ఎన్నికల ప్రకటన వెలువడింది. వచ్చే నెలలోనే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చే నటులకు ఎన్నో సవాళ్ళు ఉంటాయని పవన్ చెప్పడం గమనార్హం. జననాయకన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని పవన్ ప్రశ్నించారు. క్లీన్ సర్టిఫికేట్ కోసం వారే కోర్టుకు వెళ్ళారని ఆయన అన్నారు ఇదే సందర్భంలో తన ఓజీ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందని, దాని విషయంలో లాబీయింగ్ చేయాలని తన నిర్మాతలు కోరినా తాను సినిమాలు రాజకీయం వేరు అని స్పష్టంగా చెప్పాను అని గుర్తు చేశారు. తమిళనాడులో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందని పవన్ చెప్పారు
