Begin typing your search above and press return to search.

కుంకీ ఏనుగులకు పవన్ వెల్ కమ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కుంకీ ఏనుగులకి పూలు చల్లి స్వాగతం పలికిన అనంతరం వాటికి ఆహారం సైతం అందిస్తారు.

By:  Satya P   |   24 July 2026 5:00 AM IST
కుంకీ ఏనుగులకు పవన్ వెల్ కమ్
X

కుంకీ ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతున్నారు. పవన్ ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగుర్లు చిత్తూరు జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు అటవీ శాఖ అధికారులు తరలిస్తున్నారు. దాంతో ఈ ఏనుగులు వచ్చే మార్గమధ్యంలో అంటే మంగళగిరి వద్ద కుంకీ ఏనుగులకి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు. ఈ విధంగా మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు సాదర స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కుంకీ ఏనుగులకి పూలు చల్లి స్వాగతం పలికిన అనంతరం వాటికి ఆహారం సైతం అందిస్తారు. అనంతరం వాటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకు సాగనంపుతారు.

జంట ఏనుగులతో :

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జంట ఏనుగులు అభిమన్యు జయంత్ పార్వతీపురం జిల్లాకు వెళ్తున్నాయి. పార్వతీపురం జిల్లాలో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులతో రైతులు ఇబ్బంది పడుతున్నారు దాంతో పవన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా మన్యం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పవన్ ఇచ్చిన ఆదేశాల మేరకు కుంకీ ఏనుగులు ఆ జిల్లాలోకి అడుగు పెట్టబోతున్నాయి. ఈ కుంకీ ఏనుగులు వస్తే కనుక మన్యం జిల్లా ప్రజలకు అడవి ఏనుగుల బెడద నుంచి భారీ ఎత్తున ఊరట లభిస్తుందని అధికారులు అంటున్నారు.

ప్రత్యేక శిక్షణతో :

ఈ రెండు కుంకీ ఏనుగులల్లో జయంత్ అనేది నానియాల్ ఏనుగుర్ల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందగా, అభిమన్యు అనే ఏనుగుని కర్ణాటక నుంచి తీసుకుని వచ్చారు. ఈ కుంకీ ఏనుగులకు అడవి ఏనుగులని కట్టడి చేయడంలో విశేషమైన అనుభవం ఉంది. ఇప్పటికే ఇవి చాలా కీలక ఆపరేషనలో పాల్గొని తమ సత్తా నిరూపించుకున్నాయి. ఇక పార్వతీపురం మన్యం జిల్లాకు పొరుగున సరిగద్దుగా ఉన్న ఒడిషా నుంచి పెద్ద ఎత్తున అడవి ఏనుగులు వస్తున్నాయి. అవి ఏకంగా పంట పొలాలలోకి దూరి మొత్తం పంటలను సర్వ నాశనం చేస్తున్నాయి. దాంతో రైతాంగం అంతా వీటి బెడద నుంచి కాపాడాలని మొర పెట్టుకుంది. దాంతో అటవీ శాఖ మంత్రిగా పవన్ చొరవ తీసుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కుంకీ ఏనుగులు అంటే :

ఇక కుంకీ ఏనుగులు అంటేనే అడవి ఏనుగులను అదుపు చేయడానికి తరిమికొట్టడానికి లేదా పట్టుకోవడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన పెంపుడు ఏనుగులుగా చెబుతారు. ఇవి మానవ వన్యప్రాణుల మధ్యలో సంఘర్షణలను తగ్గించడంలో అటవీ శాఖకు ఎంతో కీలకంగా సహాయపడతాయి. అడవి ఏనుగుల గుంపులను పంట పొలాల నుండి అడవుల్లోకి తిరిగి మళ్లించడం కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధారణంగా మగ ఏనుగులు శారీరకంగా బలంగా, దూకుడుగా ఉండటం వలన వాటినే ఎక్కువగా కుంకీలుగా ఎంపిక చేస్తారు. ఇవి అడవి ఏనుగులను భయపెట్టి శాంతపరచడంలో విశేషమైన నేర్పు కలిగి ఉంటాయి.