కూటమిలో చిచ్చు.. పవన్ కామెంట్స్ నిజమవుతాయా..?
ఉద్దేశ పూర్వంగా అన్నారో.. లేక, అన్యాపగా చెప్పారో తెలియదు కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు
By: Garuda Media | 4 Aug 2025 11:00 PM ISTఉద్దేశ పూర్వంగా అన్నారో.. లేక, అన్యాపగా చెప్పారో తెలియదు కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయం గా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇది నిజమే అయితే.. ఇప్పటి నుంచే నాయకులు ముందుకు కదలాలి. లేకపోతే.. చేతులు కాలే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా.. ఏదో హెచ్చరికగా మాత్రమే ఆయన చెప్పారని అంటే.. నాయకులను కంట్రోల్ చేస్తున్నారని అనుకోవాలి.
ఎలా చూసుకున్నా.. పవన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం చర్చ జోరుగానే సాగుతోంది. వాస్తవానికి ఇప్పటికి ప్పుడు వైసీపీ కూటమిలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నిజానికి.. గత ఎన్నికలకు ముందే.. వైసీపీ ప్రయత్నాలు చేసింది. కాపుల ఓట్లను తాకట్టు పెడుతున్నారని.. టీడీపీ అధినేతను సీఎంను చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని.. కాపులు మేల్కోవాలని పదే పదే ప్రచారం చేసి చేతులు కాల్చుకున్న పరిస్థితి ఉంది. ఇక, పవన్‌ను నేరుగా విమర్శించి కూడా మరో పెద్ద తప్పేశామని.. వైసీపీ అధినేత జగన్ గుర్తించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఇప్పుడు వైసీపీకి కూటమిలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏంటన్నది ప్రశ్న. ఒకవేళ అలా చేసినా.. ప్రభుత్వం అయితే పడిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే.. టీడీపీకి కావాల్సినంత మెజారిటీ ఉంది. సో.. వైసీపీ ఏం చేసినా.. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు. పైగా.. పవన్‌ను తిట్టిపోయడం వల్ల సాధించి న దాని కంటే పోగొట్టుకున్నదే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు.. వైసీపీ ని ఉద్దేశించే చేసినా.. అంతర్గతంగా సొంత పార్టీ నాయకులను ఏమీ అనలేక..క్షేత్రస్థాయిలో నాయకులపై ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. జనసేన వర్సెస్ టీడీపీ మధ్య కొన్ని కొన్ని చోట్ల బహిరంగ యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన నాయకుల వ్యవహారాలపై టీడీపీ నాయకులు బయటకు చెబుతున్నారు. నిజానికి రాజకీయాల్లోకి వచ్చిన వారు పూర్తిగా ప్రజలకే అంకితం కావాలని ఉన్నా.. మరోసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి.. అంతో ఇంతో వెనుకేసుకోక తప్పదు.
ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులదీ ఒకే దారి. అలాంటప్పుడు.. ఒక్క జనసేన నాయకులు చేస్తున్న వ్యవహారాలే బయటకు వస్తున్నాయి. అలానే.. టీడీపీ నాయకులను కూడా కొందరు జనసేన నాయకులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో వివాదాలు కామన్‌గా మారాయి. ఈ విషయంలోనే పవన్ కల్యాణ్.. ఇలా వ్యాఖ్యానించి ఉంటారన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
