Begin typing your search above and press return to search.

పిఠాపురంలో ఈక పడినా వైరలే... పవన్ కల్యాణ్ నోట ఏరి వేత మాట!

ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మైకుల ముందుకు వస్తే ప్రత్యర్థులకు తనదైన శైలిలో వార్నింగులు ఇచ్చే పవన్ కల్యాణ్.. సంక్రాతి మహోత్సవాల వేళ మరోసారి ఫైర్ అయ్యారు.

By:  Raja Ch   |   9 Jan 2026 3:43 PM IST
పిఠాపురంలో ఈక పడినా  వైరలే... పవన్  కల్యాణ్  నోట ఏరి వేత మాట!
X

ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మైకుల ముందుకు వస్తే ప్రత్యర్థులకు తనదైన శైలిలో వార్నింగులు ఇచ్చే పవన్ కల్యాణ్.. సంక్రాతి మహోత్సవాల వేళ మరోసారి ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా.. పిఠాపురంలో కాకి ఈక పడినా ఏదో జరిగిందని ప్రచారం చేసున్నారని.. అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారని.. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఏరి వేస్తానని హెచ్చరించారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

అవును... పిఠాపురంలో నిర్వహించిన 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం విషయంలో జరుగుతున్న పలు వ్యవహారాలు, ప్రచారాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఘాటు హెచ్చరికలతోనూ పవన్ ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ తో పాటు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

తెలంగాణకు ఆంధ్రా ప్రేమను తీసుకెళ్లాలి..!:

ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని చూపించాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా... తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రజల ప్రేమను తీసుకెళ్లాలని.. అక్కడి సోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించి, వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపాలని అన్నారు. ఈ సంక్రాంతిని అన్ని మతాలవారూ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే కోడిపందేలు, జూదాలు మాత్రమే కాదని.. ఈ సరదాలను తాను కాదనడం లేదని.. అలా అని వాటికే పరిమితం కాకూడదని పవన్ సూచించారు.

పిఠాపురం నుంచి పోటీ భగవంతుడి సంకల్పం!:

ఈ సందర్భంగా... శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల పిఠాపురం అని చెప్పిన పవన్ కల్యాణ్.. తాను ఇక్కడి నుంచి పోటీ చేయడం భగవంతుడి సంకల్పం అని అన్నారు. ఇదే క్రమంలో... పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని.. తనను మరింత బలోపేతం చేస్తే మరింతగా పనిచేస్తానని.. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

సొంత బాబాయ్ ని చంపినా అది వార్త కాదు కానీ..!:

ఇదే క్రమంలో ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన కీలక విషయాలపై స్పందించిన పవన్ కల్యాణ్... పులివెందులలో సొంత బాబాయ్‌ ని చంపినా అది వార్త కాదు కానీ.. పిఠాపురంలో స్కూల్‌ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్త అవుతుందని... ఈ విధంగా పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడ కూర్చొని ఏరివేస్తానని హెచ్చరించారు.

మాటలు మెత్తగా.. చేతలు గట్టిగా..!:

ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో బూతులు తిట్టడం, కేసులు పెట్టడం చేశారని చెప్పిన పవన్ కల్యాణ్.. మళ్లీ అలాంటివి పిఠాపురంలో తెచ్చే ప్రయత్నం జరుగుతోందని.. ఈ క్రమమంలో శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా.. 'నా మాటలు మెత్తగా.. చేతలు గట్టిగా ఉంటాయి.. నన్ను అన్నా.. పార్టీని అన్నా భరిస్తా.. కానీ, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిని మాత్రం క్షమించను' అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని.. కూటమి పొత్తును బలహీనం చేసే ప్రయత్నం చేయొద్దని.. ప్రజలను ఎలా కాపాడాలి అనే అంశంపై తనకు, చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని పవన్‌ కల్యాణ్ తెలిపారు.

డబ్బు కోసం రాలేదు..!:

కొబ్బరి ఆకు పడ్డా, తాటాకు ఊడి పడ్డ, కాకి ఈక పడ్డా.. పిఠాపురంలో అయ్యో, అమ్మో అంటున్నారని.. చెడు వార్తలకి మీరు బలం ఇస్తున్నారని.. ఈ విషయంలో మీరు ఎదురు తిరగకపోతే మంచిది కాదని సూచించిన పవన్ కల్యాణ్... తాను డబ్బు కోసం రాజకీయాలకి రాలేదని.. సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు తెచ్చుకోగలనని వెల్లడించారు!