పవన్ ప్రకటన కోసం వేయి కళ్ళతో !
విశాఖలో పవన్ కళ్యాణ్ తన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఆయన విశాఖలో బస చేయనున్నారు.
By: Satya P | 26 Aug 2025 8:00 AM ISTవిశాఖలో పవన్ కళ్యాణ్ తన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఆయన విశాఖలో బస చేయనున్నారు. అయితే పవన్ విశాఖ వస్తున్న సమయం సందర్భాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా గట్టి హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పాత వీడియోలను గుర్తు చేస్తూ :
వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్నపుడు పవన్ అనేక సార్లు విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఏపీ వ్యాప్తంగా డిజిటల్ కాంపెయిన్ అని 2021 డిసెంబర్ లో మూడు రోజుల పాటు ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ వేదికగా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో తమ గళం విప్పాలని ఆయన ఆనాడు కోరారు ఇపుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా కూటమి ఎంపీలు ఏమి చేస్తున్నారు అని ఉక్కు కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రకటన చేయాల్సిందే :
విశాఖ స్టీల్ ప్లాంట్ లోని 32 కీలక విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది దాంతో కార్మిక లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోల్ సేల్ గా ప్రైవేట్ చేయకుండా రిటైల్ గా ప్రైవేట్ పరం చేస్తోందని దీని ద్వారా ఉద్యమం నీరు కార్చాలన్న వ్యూహం ఉందని కూడా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే పార్టీ తరఫున ప్రకటన చేయాల్సిందే అంటున్నారు.
నాదెండ్ల క్లారిటీ ఇచ్చినా :
విశాఖలో జనసేన కార్యక్రమాలను చూసేందుకు తాజాగా వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేట్ కాదని హామీ ఇచ్చారు. ఈ విషయంలో వైసీపీవి రాజకీయ ప్రకటనలు అన్నారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నందువల్ల ఆయన నోటి నుంచి ప్రకటన రావాలని పవన్ మాటిస్తేనే తమకు భరోసాగా ఉంటుందని కార్మిక నేతలు అంటున్నారు.
పవన్ రియాక్షన్ కోసం :
పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు మీద స్పందించాల్సిందే అన్నది ప్రజా సంఘాలు మేధావుల నుంచి వస్తున్న మాట. దాంతో విశాఖలో మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండే పవన్ 30న జరిగే బహిరంగ సభలో అయినా ఈ విషయం మీద మాట్లాడుతారా అన్న ఆసక్తి పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రకటన కోసం అయితే ఉక్కు కార్మిక లోకం వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది అని అంటున్నారు.
