విజయ్ కి టచ్ లోకి పవన్...ఎన్డీయేలోకి టీవీకే ?
జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఈ రోజున ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నారు. నిజానికి రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళ పాటు పవన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
By: Satya P | 9 March 2026 11:22 PM ISTజనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఈ రోజున ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నారు. నిజానికి రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళ పాటు పవన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పొత్తులు కట్టి కూటమిలో చేరాక ఆయనకు మంచి పొజిషన్ దక్కింది. పవన్ వెండి తెర మీద తిరుగులేని హీరో. అయితే రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఆ సినీ ఇమేజ్ మొత్తం ఓట్లుగా టర్న్ కాలేదు. దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఏపీలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులు. త్రిముఖ పోరులో కొత్త పార్టీలు పెర్ఫార్మెన్స్ ఎంత చేసినా ఓటు షేర్ దగ్గర నిరాశ కలుగుతుంది. ఇది ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో రుజువు అయింది. మరి తమిళనాడులో కూడా దళపతిగా వెండితెరను పండించిన విజయ్ టీవీకే పేరుతో పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.
సూపర్ స్టార్ ఇమేజ్ తో :
అయిదు పదుల వయసులో ఉన్న విజయ్ ది రెండున్నర దశాబ్దాల వెండి తెర అనుభవం. ఆయనది సూపర్ స్టార్ ఇమేజ్. దాంతో ఆయన తన రాజకీయ అవకాశాలను పరీక్షించుకుంటున్నారు. ఇక విజయ్ టీవీకే పార్టీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని చూస్తోంది. మొత్తం 234 సీట్లు కలిగిన తమిళనాడు శాసనసభలో విజయ్ పార్టీ ఫీల్డ్ లోకి దిగితే ఎవరికి రాజకీయ నష్టం అన్న చర్చ వస్తోంది. సాధారణంగా చూస్తే అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేక ఓట్లు పెద్ద ఎత్తున చీలిపోతే అది పవర్ లో ఉన్న వారికే లాభం. ఇది అనేక ఎన్నికల్లో రుజువు అయిన సత్యం. అందుకే విజయ్ పార్టీ వల్ల ఎక్కువగా ఎన్డీయే కూటమి దెబ్బ తింటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ పార్టీని తమతో చేర్చుకోవాలని ఎన్డీయే పెద్దలు చేయని ప్రయత్నం లేదని అంటున్నారు. బీజేపీ తమిళనాడు అధికార ప్రతినిధి ఒకరు అయితే ఓపెన్ గానే విజయ్ ని కోరారు. ఎన్డీయేలో చేరాలని లేకపోతే అధికార పార్టీ డీఎకేకే లాభం అని కూడా విశ్లేషించి మరీ చెప్పారు.
పవన్ రంగంలోకి :
ఈ క్రమంలో కేంద్ర బీజేపీ పెద్దలతో మంచి సాన్నిహిత్యం ఉన్న పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపారని అంటున్నారు. ఆయన సినీ నటుడే. విజయ్ కూడా అదే ఫీల్డ్ కి చెందిన వారు కావడంతో పవన్ ద్వారా విజయ్ కి చెప్పించారు అని ఒక ప్రచారం అయితే పుకారులా సాగుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విజయ్ కి టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. ఎన్డీయేలో చేరాలని కూడా ఆహ్వానించారు అని అంటున్నారు. తన 2019 నాటి ఎన్నికల అనుభవాలను కూడా పవన్ విజయ్ కి వివరించారు అని అంటున్నారు. ఒంటరిగా వెళ్తే ఇబ్బంది కలుగుతుందని అందుకే ఎన్డీయేలో చేరి యాభై సీట్ల దాకా తీసుకుని పోటీ చేస్తే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవచ్చు అని సూచించారు అని అంటున్నారు.
టీవీకే నో చెప్పిందా :
అయితే ఈ ప్రతిపాదనకు టీవీకే నో చెప్పింది అని కూడా ప్రచారం సాగుతోంది. తమ పార్టీ ఒంటరిగానే మొత్తం సీట్లకు పోటీ చేతుంది అని సీనియర్ టీవీకే నాయకుడు అధవ్ అర్జున తాజాగా చెప్పడం విశేషం. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు అని అంటున్నారు. అంతే కాదు ఏ కూటమిలో చేరేందుకు ప్లాన్స్ ఏవీ తమ వద్ద లేవని తాము ప్రజలను నమ్ముకుని బరిలోకి దిగుతున్నామని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీవీకే అధినేత విజయ్ అయితే ఈ పుకార్ల మీద నేరుగా స్పందించకపోయినా ఆ పార్టీ సీనియర్ నేత మాటలను బట్టి చూస్తే విజయ్ పార్టీ ఎన్డీయేతో చేతులు కలపదని అంటున్నారు.
ఫిలాసఫీ వేరు :
ద్రవిడ వాదాన్ని నమ్ముకుని టీవీకేని ఏర్పాటు చేసిన విజయ్ తన సిద్ధాంతాలకు భిన్నంగా బీజేపీతో ఉన్న ఎన్డీయే కూటమిలో చేరేది ఉండదని అంటున్నారు. దాని వల్ల విజయ్ పార్టీకి రాజకీయంగా తాత్కాలికంగా ఏమి మేలు జరుగుతుంది అన్నది పక్కన పెడితే దీర్ఘకాలంలో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అయితే భావ సారూప్యం కలిగిన పార్టీలతో పొత్తు అయితే టీవీకే ఓకే అనవచ్చేమో అన్న చర్చ ఉంది. మొత్తానికి విజయ్ కి టచ్ లోకి పవన్ వెళ్లారా ఆయన ఎన్డీయేలో చేరమని చెప్పారా అన్నది తెలియదు కానీ ప్రచారం అయితే పెద్ద ఎత్తున గాసిప్స్ గా సాగుతోంది.
