గ్రామస్థాయి నుంచి పార్లమెంటు దాకా... పవన్ చెప్పిన స్ట్రాటజీ
జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు.. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు చురుకుగా పనిచేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
By: Garuda Media | 3 Dec 2025 7:00 PM ISTజనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు.. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు చురుకుగా పనిచేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నా రు. ''ప్రభుత్వంలో ఉన్నాం కదా.. అని అజాగ్రత్త వద్దు. నిరంతరం ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. వారికి మనం జవాబుదారీగా ఉండాలి.'' అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాజాగా బుధవారం పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలో పార్టీ భవిష్యత్తు ప్రణాళికను ఆయన చెప్పారు.
చురుకుగా ఉండే కార్యకర్తలను ప్రోత్సహించాలని.. గ్రామీణ స్థాయి నుంచి పార్లమెంటు నియోజకవర్గం వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పవన్ పేర్కొన్నారు. ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని.. ముఖ్యంగా రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా.. కమిటీలు నియమించాలన్నారు.
ఈ కమిటీలను నియమించేబాధ్యత నాయకులదేనని పేర్కొన్నారు. చురుకుగా ఉంటూ.. ప్రజల కోసం పనిచేసేవారిని ఎంపిక చేయాలని పవన్ కల్యాణ్ తెలిపారు. ఒక్కొక్క కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండేలా.. వారు ప్రతి విషయంలోనూ యాక్టివ్‌గా పనిచేసేలా చూడాలని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తామన్నారు. ``రాత్రికి రాత్రి ఏదీ జరగదు. ఈ స్థాయికి వచ్చేందుకు పది సంవత్సరాలు పడుతుందని నేను కూడా అనుకోలేదు.`` అని వ్యాఖ్యానించారు.
నామినేటెడ్ పదవుల పైనా పవన్ సమీక్షించారు. కూటమిలో మనకు ఉన్న రేషియోను బట్టి పదవులు వస్తాయన్న ఆయన.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో సమస్యలపై చర్చించేందుకు.. పరిష్కరించేందుకు.. సమస్యల పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో 11 మంది సభ్యులను నియమించనున్నట్టు తెలిపారు. మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
