అదే నా రాస్తా....శేషేంద్ర కవితను ట్వీట్ చేసిన పవన్
గుంటూరు శేషేంద్ర శర్మ. యువ కవి. విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు.
By: Satya P | 3 Jun 2026 2:39 PM ISTగుంటూరు శేషేంద్ర శర్మ. యువ కవి. విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన రెండింటిలో సమాన ప్రతిభావంతుడు. ఆధునిక కవిత్వంలో అందె వేసిన చేయి. అన్నింటికీ మించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆయన కవితలు ఇష్టం. మరో మారు శేషేంద్ర శర్మను ఆయన కవితను తలచుకున్నారు పవన్ కళ్యాణ్. నిన్నటికి నిన్న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం వేళ తన పార్టీ తెలంగాణా యూనిట్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా అనుమతి దక్కలేదు. దాంతో ప్రెస్ మీట్ లోనే మొత్తం చెప్పాల్సింది చెప్పేసి సంచలనం క్రియేట్ చేశారు పవన్. దాని ప్రకంపనలు తెలంగాణా రాష్ట్రంలో రాజకీయంగా ఇంకా బలంగా గట్టిగా వినిపిస్తున్న వేళ పవన్ శేషేంద్ర శర్మ కవితను జస్ట్ అలా ట్వీట్ చేశారు. అందులోని భావాలను చూస్తే పవన్ రాజకీయ పధం కానీ ఆయన ఆలోచనా విధానం కానీ ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా సంకేతం ఇస్తున్నట్లుగా ఉంది అంటున్నారు.
ప్రాణాల్ని ఆట బంతుల్లా విసిరేస్తుందో :
ఇక శేషేంద్ర శర్మ కవితల గురించి చెప్పాల్సింది లేదు. ఒక్కో మాట అగ్ని కణంగా వీర విహారం చేస్తుంది. ఆయన రాసిన ఒక చిన్న కవితలో మొత్తం ప్రపంచాన్ని ఒడిసిపట్టి ఘనమైన సందేశం ఇస్తుంది. అలాంటి అగ్గి రవ్వ లాంటి ఒక కవితను ఎంపిక చేసుకుని మరీ సరైన సమయంలో సరైన వ్యాఖ్యానం ఆన్నట్లుగా పవన్ వదిలారు. ఇంతకీ ఆ కవిత సాగిన తీరు చూస్తే మెదడులోని పవర్ పదునూ రెండూ పోటీ పడి జోరు చేయడం ఖాయం. ఇంతకీ ఆ కవిత ఏమిటి అంటే ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రాస్తా ఏ రాస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో ఏ రాస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో ఏ రాస్తాలో మరణం మహా ప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా...ఇలా అగ్ని ప్రభంజనంగా సాగిపోయే ఈ కవితని ఏరి కోరి మరీ పవన్ ట్వీట్ చేయడం వెనక ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆయన అభిమాన కవిత అనుకోవచ్చు.
ఆగేది లేదనేగా :
అంతే కాదు వర్తమాన రాజకీయాలలో పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయన తనకు ఎదురైన అడ్డులూ ఆటంకాలను సైతం అధిగమించి తాను అనుకుంటున్న గమ్యానికి చేరాలని చూస్తున్నారు. మరి ఈ కవితలో అర్ధం పరమార్ధం చూసినా అదే శబ్దం ద్వనిస్తోంది. ఇందులో ఉన్న ఒక్కో మాట కూడా నిప్పు కణికగా మండుతోంది. ప్రాణాలను సైతం ఆట బంతుల్లా విసిరేసే రాస్తా అంటే కడు భయంకరమైనది, అలాగే ఏ రాస్తా అయితే యుద్ధాలు చేస్తుందో అని కూడా ఉంది. సంకెళ్ళు అగ్ని జ్వాలలు సవాళ్ళు అపజయాలు ఓటములు ఇలా ఎన్ని అడ్డంకులు ఉన్నా అదే నా రాస్తా అని ఈ కవిత ద్వారా పవన్ తన సైన్యానికి ఏమైన సందేశం ఇవ్వదలచారా అంటే ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా శేషేంద్ర శర్మ అధ్బుతమైన కవితను ట్వీట్ చేయడం ద్వారా ఎన్నో మెదళ్ళకు పదును పెట్టించారు, అలాగే నిస్తేజమైన జనాలు ఈ కవిత చదివితే చైతన్యం పుట్టేలా చేశారు. సో అందుకు పవన్ కి ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మరి.
