Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ట్వీట్ కు పూనమ్ కౌర్ కామెంట్!

By:  A.N.Kumar   |   9 May 2026 5:29 PM IST
పవన్ కళ్యాణ్ ట్వీట్ కు పూనమ్ కౌర్ కామెంట్!
X

ఒమన్‌లో చిక్కుకున్న ఒక తెలుగు మహిళను స్వదేశానికి రప్పించిన విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించడం ఇప్పుడు అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

ఒమన్ నుంచి సురక్షితంగా భారత్‌కు..

అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ అనే మహిళ ఉపాధి కోసం ఒమన్‌ వెళ్లగా అక్కడ ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. తనను కాపాడి భారతదేశానికి రప్పించాలని ఆమె ఆ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించి ఆమెను రక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

భారత రాయబార కార్యాలయం, ఒమన్ అధికారులు, జనసేన గల్ఫ్ కార్యకర్తలు ఏపీఎన్.ఆర్.టీ ప్రతినిధుల సమన్వయంతో షానవాజ్ ఎట్టకేలకు సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎక్స్‌ వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ.. "ఒక భారతీయురాలు క్షేమంగా తిరిగి రావడానికి మానవీయ దృక్పథంతో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. లోకంలో ఏ మూలన ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి భారతీయుడికి మేము అండగా ఉంటాం" అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతును కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

దృష్టి మళ్లించే ప్రయత్నం.. పూనమ్ కౌర్ ఘాటు స్పందన

పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్‌పై నటి పూనమ్ కౌర్ అనూహ్య రీతిలో కామెంట్ చేసారు. ఆమె తన స్పందనలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఇటువంటి విజయగాథలు కేవలం అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నాలేనని ఆమె అన్నారు. గతంలో పోరాడతానని హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కేసును ఆమె గుర్తు చేశారు. "సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను ముందుగా నిలబెట్టుకోండి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి" అని కామెంట్ చేసారు.తరువాత కామెంట్ ని డిలీట్ చేసినట్టు తెలుస్తుంది.

సోషల్ మీడియాలో చర్చాంశనీయం

గతంలోనూ పవన్ కళ్యాణ్ , దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ఉద్దేశించి పూనమ్ కౌర్ పరోక్షంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈసారి పవన్ అధికారికంగా చేసిన ఒక సహాయక చర్యపై ఆమె నేరుగా స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.

నెటిజన్ల స్పందన

పూనమ్ కౌర్ అడిగిన దాంట్లో తప్పేముందని, గతంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించడం బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఆమె హక్కు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక మహిళను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న విషయాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని, జనసేన అభిమానులు పూనమ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున అందిస్తున్న సేవలను ఒక వర్గం ప్రశంసిస్తుంటే.. పూనమ్ కౌర్ వంటి వారు పాత వాగ్దానాలను గుర్తు చేస్తూ ఆయనను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.