పవన్ కోరినా టీటీడీ నో .....మ్యాటరేంటి ?
పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి. కీలకమైన స్థానంలో ఆయన ఉన్నారు. అధికారంలో ఉన్న ఆయన ఏమైనా చేయగలరు అని అంతా అనుకుంటారు.
By: Satya P | 29 Dec 2025 5:00 PM ISTపవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి. కీలకమైన స్థానంలో ఆయన ఉన్నారు. అధికారంలో ఉన్న ఆయన ఏమైనా చేయగలరు అని అంతా అనుకుంటారు. అయితే వస్తుతహా పవన్ అలాంటి వారు కాదు అన్నది తెలిసిందే. ఆయన ఎక్కడా ఎవరి మీద ఒత్తిడి పెట్టరు, రూల్స్ ప్రకారమే నడచుకుంటారు. అయితే పవన్ తనకు ఉన్న అభిరుచులను కొన్ని సందర్భాలలో బయటపెడుతూంటారు. వాటి విషయంలో కూడా అందరిలాగానే తనకు అనుమతి ఇస్తే ఓకే అనుకుంటారు, లేకపోతే కూడా ఏమీ అనుకోరు. ఇపుడు అదే జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి పవన్ చేసిన ఒక రిక్వెస్ట్ కి బోర్డు నుంచి నో అన్న మాట వచ్చింది. అయినా పవన్ నొచ్చుకోలదు, కారీ ఆన్ అని సానుకూలంగా రియాక్ట్ కావడమే దటీజ్ పవన్ అని పిస్తుంది అని అంటున్నారు.
ఇంతకీ కోరిందేంటి :
పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మిక పాళ్ళు ఎక్కువ అన్నది తెలిసిందే. ఆయన భక్తి భావంతో ఉంటారు. దేవుడి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూంటారు. ఇక ఆ దేవ దేవుడు కలియుగ వైకుంఠ నాధుడు అయిన తిరుమల వెంకన్న అంటే పవన్ కి ఎంత భక్తి అన్నది వేరేగా చెప్పాల్సినది లేదు ఆ భక్తి తోనే పవన్ ఒక అభ్యర్థన టీటీడీ ముందు ఉంచారు అంటున్నారు. తిరుమల కొండ మీద ఒక గెస్ట్ హౌస్ నిర్మించాలని పవన్ అనుకున్నారుట. తన సొంత ఖర్చుతో నిర్మించే ఆ గెస్ట్ హౌస్ కి అనుమతించాలని ఆయన టీటీడీకి అభ్యర్ధన పంపించారు. అయితే దానికి టీటీడీ నో చెప్పేసి సంచలనం రేపింది. అయితే ఇది కేవలం పవన్ విషయంలోనే కాదు టీటీడీ తన రూల్స్ ని అలా ఫ్రేం చేసుకుంది అని అంటున్నారు.
గతంలో ఇచ్చినా :
ఇక టీటీడీ గతంలో కొంతమందికి ఈ విధంగా గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి అనుమతించింది. అదంతా దశాబ్దాల క్రితం. ఇపుడు ఆ డెసిషన్స్ ని కూడా పక్కన పెట్టేసింది. దానికి కారణం తిరుమలలో భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఒకప్పుడు రోజుకు పాతిక ముప్పయి వేల మంది దాకా భక్తులు వస్తే ఇపుడు అది డెబ్బై వేల దాకా అవుతోంది. ఇక ముఖ్యమైన పండుగ వేళలలో లక్ష దాకా ఆ మార్క్ చేరుకుంటోంది. ఇక టీటీడీ ఎన్ని కాటేజీలు అతిధి భవనాలు నిర్మించినా అందులో రూముల సంఖ్య చూస్తే గట్టిగా ఏడెనిమిది వేలకు మించి లేవు. ఇక కొండ మీద చూస్తే భూమి చాలా తక్కువగా ఉంది అని అంటున్నారు. దాంతో భవిష్యత్తు అవసరాల కోసం తామే కొత్తగా ఏవైనా నిర్మాణాలు చేయాలనుకుంటే కనుక వాడుకోవడానికి భూములను పదిలపరచుకుంటోంది. అందుకే పవన్ సహా ఎవరు కోరినా సొంతంగా నిర్మాణాలకు టీటీడీ నో చెబుతోంది అని అంటున్నారు.
ఇదీ విధానం :
అయితే టీటీడీ ఒక విధానం అనుసరిస్తోంది. దాతలు ఎవరైనా విరాళాలు టీటీడీకి ఇస్తే తామే ఆ నిధులతో అతిధి భవనాలు నిర్మించి వాటికి తమ ఆధ్వర్యంలో నడుపుతుంది. అదే సమయంలో దాతలకు ఒక ఏడాదిలో కొన్ని రోజులు ఆ అతిధి భవనాల రూములు వాడుకోవడానికి మాత్రం అనుమతిస్తోంది అని అంటున్నారు. ఈ విధంగా ఎవరైనా చేయవచ్చు తప్పించి సొంతంగా గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి అనుమతులు లేవని అంటున్నారు. అంతే కాదు గతంలో నిర్మించి పాడు అయిన పురాతనం అయిన వ్యక్తిగత గెస్ట్ హౌస్ లు ఎవరివి ఉన్నా పడకొట్టి అందులో కొత్తగా టీటీడీనే నిర్మాణాలు చేస్తోంది. అంతే కాదు వాటికి దేవ దేవుడి పేరుని పెడుతూ సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది. మొత్తానికి టీటీడీ తన కోరికకు నో చెప్పినా పవన్ అయితే దీనిని పాజిటివ్ గానే తీసుకున్నారని అంటున్నారు. మొత్తానికి పవన్ కీలక పదవిలో ఉండి కూడా టీటీడీ డెసిషన్స్ ని గౌరవించడం అంటే వర్తమానంలో ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఉన్నారని చెప్పక తప్పదు.
