కొండగట్టులో కరసేవ.. పవన్ ఆసక్తికర ప్రకటన
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు శ్రీఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
By: Tupaki Political Desk | 3 Jan 2026 3:25 PM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు శ్రీఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆలయాన్ని సందర్శించారు. అప్పట్లో ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం టీటీడీ నుంచి రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో ఆలయంలో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టిటిడి. ఛైర్మన్ బిఆర్.నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి కరసేవ చేస్తానని ప్రకటించారు. గిరి ప్రదక్షిణ మార్గం బాగు చేసేలా అందరూ తనతో చేయి కలపాలని పిలుపునిచ్చారు.
“ఆంజనేయస్వామి అందరి దేవుడు, విశ్వాంతర్యామి. ఆయన ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. మా ఇలవేల్పు ఆంజనేయ స్వామి వారికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సాకారం చేద్దాం. అందరూ పూనుకొని స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దాం” అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రామభక్తులు అనుకుంటే కానిదంటూ ఏదీ ఉండదని, త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలని ఆకాక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానని చెప్పారు. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందన్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.35.19 కోట్లతో వసతి సముదాయం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శనివారం శంకుస్థాపన చేశారు. 2024 ఎన్నికలకు ముందు పవన్ ఇక్కడి నుంచే వారాహి యాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో ఆలయంలో వసతి సముదాయం, దీక్షా మండపం అవసరాన్ని ఆలయ అధికారులు, పండితులు పవన్ దృష్టికి తీసుకు వెళ్లారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తులు, ఆంజనేయస్వామి మాల ధరించి వస్తున్న స్వాములు పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో టీటీడీ ధార్మిక మండపాల నిర్మాణాల నిమిత్తం వెచ్చిస్తున్న నిధుల నుంచి రూ.35.19 కోట్లను విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు.
కొండగట్టు ఆలయంలో సత్రం, దీక్షల విరమణ మండపాల నిర్మాణం వల్ల సుమారు 2 వేల మంది భక్తులు ఒకేసారి దీక్షలు విరమించే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు. ఇక పవన్ మాట్లాడుతూ “కొండగట్టు గిరి ప్రదక్షిణకు ప్రయత్నం మొదలుపెట్టండి. నేను స్వయంగా వచ్చి కరసేవ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. అంతా సమష్టిగా స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి.’’ అని పిలుపునిచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2008 నుంచి తనకు తెలుసునని చెప్పారు. ఉస్మానియాలో ఎన్ఎస్ యూ నాయకుడిగా ఉన్నపుడు, తనతోపాటు కలిసి పనిచేసే వారని వెల్లడించారు.
