అడవిలో డిప్యూటీ సీఎం పవన్.. అధికారుల్లో టెన్షన్.. టెన్షన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్ర పర్యటన అటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది.
By: Tupaki Political Desk | 8 Nov 2025 4:19 PM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్ర పర్యటన అటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం పవన్ వచ్చారు. తొలిరోజు రేణిగుంట విమానాశ్రయం నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి నేరుగా వచ్చిన పవన్ కాలిబాటన రెండు కిలోమీటర్లు మేర పర్యటించారు. సుమారు 4 కి.మీ. దట్టమైన అటవీ ప్రాంతంలో పవన్ గడిపారు. క్రూర మృగాలు తిరిగే చోటున పవన్ నడవడమే కాకుండా, ప్రతి చెట్టు, గట్టును పరిశీలించడం అధికారులను టెన్షన్ పెట్టింది.
తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతోపాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తెలుసుకున్నారు. ఆ తర్వాత మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
ఇక పవన్ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పవన్ వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది. నల్లని టీషర్టు, ఆర్మీ యూనిఫాంగా వాడే ఖాకీ ఫ్యాంటును ధరించారు. నల్లటి గూగుల్స్ తో కనిపించిన పవన్ ‘గబ్బర్ సింగ్’లా ఆకట్టుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
