Begin typing your search above and press return to search.

ఆంధ్రాలోనే దిక్కులేదు.. వీడియో పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ను టీజ్ చేసిన పొన్నం

తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని.. కానీ ఏపీలోనే దిక్కులేని తాను ఇక్కడ సీఎం కావాలని ఎలా అనుకుంటానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

By:  A.N.Kumar   |   3 Jun 2026 9:21 AM IST
ఆంధ్రాలోనే దిక్కులేదు.. వీడియో పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ను టీజ్ చేసిన పొన్నం
X

రాజకీయాల్లో పంచ్ డైలాగులు కొట్టడం.. పవర్‌ఫుల్ స్పీచ్‌లు ఇవ్వడం కేవలం సినిమా హీరోలకే సొంతం అనుకుంటే పొరపాటే.. తాజాగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్‌మీట్ చూస్తే... ఇది పొలిటికల్ కాన్ఫరెన్సా లేక కామెడీ షో స్పెషల్ ఎపిసోడా అనే డౌట్ రాక మానదు. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన పేల్చిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని.. కానీ ఏపీలోనే దిక్కులేని తాను ఇక్కడ సీఎం కావాలని ఎలా అనుకుంటానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెవిన పడటమే ఆలస్యం... డైలాగుల వర్షం మొదలైంది! "పవన్ కళ్యాణ్ నువ్వో పెయిడ్ ఆర్టిస్ట్‌వి. నా దగ్గర గనుక తగినంత డబ్బులు ఉంటే నేనే పవన్‌తో ఒక క్యారెక్టర్ చేయించి సినిమా తీస్తా!" అని మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్ వేశారు. సినిమా ఇండస్ట్రీకి పొన్నం గారు ఇచ్చిన ఈ సరికొత్త ఆఫర్ విన్నాక.. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు కూడా ఒక క్షణం ఆలోచనలో పడి ఉంటారు!

"ఆంధ్రాలోనే దిక్కులేదు... ఇక్కడ నవ నిర్మాణమా?"

గత ఎన్నికల్లో జనసేన ట్రాక్ రికార్డును గుర్తు చేస్తూ పొన్నం ప్రభాకర్ పవన్‌పై ప్రశ్నల బాణాలు సంధించారు. "గత 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఇప్పుడు ఏపీలో గెలిచారంటే దానికి కారణం టీడీపీ, బీజేపీ పొత్తు పుణ్యమే!" అంటూ ఎద్దేవా చేశారు. "ఆంధ్రప్రదేశ్‌లోనే ఏం చేయలేకపోతున్నావ్.. ఇక ఇక్కడికి వచ్చి ‘నవ నిర్మాణ సభల’ పేరుతో ఏం నిర్మిస్తావ్ తమ్ముడూ?" అంటూ లాజికల్ పంచ్ వేశారు.

పొలిటికల్ థ్రిల్లర్.. పవన్‌కు చిట్టీలు రాసేది ఎవరు?

పవన్ కళ్యాణ్ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారంటూ పొన్నం ఒక కొత్త సస్పెన్స్ కథను తెరపైకి తెచ్చారు. "పవన్‌కు మాట్లాడటానికి స్క్రిప్టులు, చిట్టీలు ఎవరు రాసిస్తున్నారో అర్థం కావడం లేదు. బీజేపీ లేదా బీఆర్ఎస్... ఈ రెండింటిలో ఎవరో ఒకరు ఆయన్ను ఆర్టిస్టుగా ఎంగేజ్ చేసి ఉంటారు" అంటూ ఒక రేంజ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ లెక్కన జనసేనాని నెక్స్ట్ సినిమాకు ప్రొడ్యూసర్లు ఎవరో పొన్నం గారికి బాగానే తెలిసినట్టుంది!

"మీ అయ్య జాగీరా?" రిటర్న్ గిఫ్ట్!

గతంలో పవన్ కళ్యాణ్ వాడిన ఫేమస్ డైలాగ్ "తెలంగాణ మీ అయ్య జాగీరా?" అనే మాటను పొన్నం ఏకంగా పవన్‌కే రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. కొండగట్టు ఆలయానికి ఇచ్చిన నిధుల ప్రస్తావన తెస్తూ... "ఆ నిధులు మీ అయ్య జాగీరా?" అని పవన్ స్టైట్ లోనే కౌంటర్ ఇచ్చారు. అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో సభ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని నిలదీశారు.

"ఆంధ్రాలోనే దిక్కులేదు.. ఇక్కడ ముఖ్యమంత్రి అవుతానా అని ఆయనే చెప్పుకుంటున్నారు" చివరగా పొన్నం ప్రభాకర్ వేసిన ఈ అల్టిమేట్ సెటైరికల్ పంచ్ ప్రస్తుతం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి పవన్ డైలాగ్‌కు పొన్నం కౌంటర్.. దానికి జనసేన రియాక్షన్... ఇలా ‘తెలంగాణ పొలిటికల్ థియేటర్’లో సరికొత్త మాటల యుద్ధానికి తెరలేచింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ అండ్ సీ!