Begin typing your search above and press return to search.

తెలంగాణలో జనసేన సరికొత్త ప్రస్థానం : మణికొండలో పార్టీ కార్యాలయం ప్రారంభం

తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్న జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   19 Jun 2026 7:10 PM IST
తెలంగాణలో జనసేన సరికొత్త ప్రస్థానం : మణికొండలో పార్టీ కార్యాలయం ప్రారంభం
X

తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్న జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా, హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొంతకాలంగా తెలంగాణలో పార్టీ విస్తరణపై దృష్టిపెట్టిన పవన్ ముందుగా రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి యుద్ధానికి సిద్ధమని ప్రత్యర్థులకు సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు. ప్రధానంగా కొద్ది రోజులుగా పవన్ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు విపక్షంలోని బీఆర్ఎస్, టీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ పవన్ వెనక్కి తగ్గకుండా తెలంగాణలో తన పట్టు నిరూపించుకునేందుకు ముందడుగు వేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

కార్యాలయంతో కొత్త ఉత్సాహం

శుక్రవారం ఉదయం మణికొండలో నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకలో పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన జనసైనికులు, వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణ తల్లికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. గతంలో కార్యాలయం లేకపోవడంతో సమావేశాలకు ఇబ్బందులు పడిన పరిస్థితి నుంచి, ఇప్పుడు సొంత కార్యాలయంతో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే దిశగా జనసేన కీలక అడుగు వేసిందని అంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యమా?

ఏపీలో వంద శాతం స్ట్రైక్ రేట్ విజయంతో చరిత్ర సృష్టించిన డిప్యూటీ సీఎం పవన్ అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని కోరుకోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రధానంగా రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ చురుకైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 336 వార్డుల్లో పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును నిర్మించుకోవడంపై పార్టీ దృష్టి పెట్టిందని అంటున్నారు.

ఇక రాష్ట్ర కార్యాలయం అందుబాటులోకి రావడంతో రాష్ట్ర కమిటీలు, నియోజకవర్గ స్థాయి సమన్వయం వేగవంతం కానుందని చెబుతున్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీగా, ఇక్కడి ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఏ పార్టీ కలిసి వచ్చినా, రాకపోయినా ఒంటరిగానైనా బరిలోకి దిగేందుకు జనసేన సిద్ధంగా ఉందని అధినేత సంకేతాలు ఇవ్వడంతో రాజకీయ విశ్లేషకులు దీనిని ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా, తెలంగాణలో జనసేన కార్యాలయం ప్రారంభం ఆ పార్టీ రాజకీయ ప్రయాణంలో ఒక కీలక మలుపుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తెలంగాణలో పార్టీని సొంతంగా నిలబెట్టాలనే పవన్ పట్టుదల స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా సెటిలర్లు, యువత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జనసేన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.