Begin typing your search above and press return to search.

పవన్ తెలంగానం.. పాత జ్ఞాపకాలతో కొత్త రాజకీయం!

తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించే దిశగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేగంగా అడుగులు వేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   23 Jun 2026 5:37 PM IST
పవన్ తెలంగానం.. పాత జ్ఞాపకాలతో కొత్త రాజకీయం!
X

తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించే దిశగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన, తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పాత ఫోటో, దాని వెనుక ఉన్న నేపథ్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తెలంగాణ ఉద్యమ కాలం నాటి తన అనుబంధాన్ని గుర్తుచేస్తూ పవన్ చేసిన ట్వీట్, ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా, తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

జ్ఞాపకాల రూపంలో రాజకీయ సందేశం

‘ఈ ఛాయాచిత్రం గురించి చాలా మంది ఆసక్తిగా అడుగుతుంటారు’ అంటూ మొదలుపెట్టిన పవన్, తన తండ్రి కొణిదెల వెంకట్రావు గారి మరణానంతరం బహుజన ఉద్యమకారుడు ఆగస్టన్, విప్లవ గాయకుడు గద్దర్ ఆయన ఇంటికి వెళ్లినప్పటి దృశ్యాన్ని పంచుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి ముందే 'సామాజిక తెలంగాణ' ఆకాంక్ష, బహుజన భావజాలం, సామాజిక న్యాయం వంటి అంశాలపై మేధావులతో చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణపై తనకున్న అనుబంధం నిన్నటిది కాదు, దశాబ్దాల క్రితమే పునాదులు పడిందని ఆయన ఆ ట్వీట్ లో వెల్లడించారు.

విమర్శలకు చెక్ చెప్పేలా..

తెలంగాణలో జనసేన విస్తరణను ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, ‘తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఆయన తెలంగాణ గురించి అప్పుడు ఏనాడైనా మాట్లాడారా?’ అంటూ టీఆర్ఎస్ నేత కవిత, ఇతర బీఆర్ఎస్ నేతలు తరచూ ప్రశ్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్ నేతలు సైతం పవన్ రాజకీయ వ్యూహాన్ని ఎండగడుతున్నారు. పవన్ కు తెలంగాణలో ఏం పని అంటూ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ నేతలు కోనసీమకు దిష్టిపెట్టారని పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇరుకన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ చేసిన ట్వీట్ ఒక వ్యూహాత్మక కౌంటర్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ వేడిలో ఉన్న మేధావులతోనే తాను అప్పట్లో సామాజిక న్యాయంపై చర్చించానని చెప్పడం ద్వారా, తాను తెలంగాణకు పరాయి వాడిని కాదనే బలమైన సంకేతాన్ని పంపే ప్రయత్నం చేశారని అంటున్నారు.

తెలంగాణపై తగ్గేదేలే..

హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, తెలంగాణ సమస్యలపై గళమెత్తడం, ఇప్పుడు ఉద్యమకారులతో ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేయడం చూస్తుంటే జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందని చెబుతున్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించడం ద్వారా, తెలంగాణలోని ఉద్యమ నేపథ్యం ఉన్న వర్గాలకు దగ్గరవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కేవలం ప్రాంతీయ వాదం మాత్రమే కాకుండా, సామాజిక తెలంగాణ అనే నినాదంతో బలహీన వర్గాలను ఆకర్షించడం పవన్ వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు.