Begin typing your search above and press return to search.

తెలంగాణలో పవన్ సభ.. విమర్శకులకు గట్టి సమాధానమా?

ఈ క్రమంలోనే తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం.. ఆయన పార్టీ విస్తరణ వ్యూహాలపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, సవాళ్లు వ్యక్తమవడంతో ఇక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

By:  A.N.Kumar   |   31 May 2026 11:22 AM IST
తెలంగాణలో పవన్ సభ.. విమర్శకులకు గట్టి సమాధానమా?
X

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది. ఆయన చుట్టూ తిరుగుతున్న రాజకీయ సమీకరణాలు, విమర్శలు, ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ రేపిన మాటల మంటలకు ఇటీవల పవన్ కౌంటర్ ఇచ్చారు. నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే పవన్ పై తెలంగాణ వాదులు, నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం.. ఆయన పార్టీ విస్తరణ వ్యూహాలపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, సవాళ్లు వ్యక్తమవడంతో ఇక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఈ నేపథ్యంలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ, బహిరంగ సభ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఉత్కంఠను రేపుతోంది.

సభ వేదికగా పవన్ వ్యూహం ఏమిటి?

తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంతో పాటు.. రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగ యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ తన గళాన్ని విప్పబోతున్నారని జనసేన శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. అయితే కేవలం ఇదొక పండుగ వాతావరణంలో జరిగే సభ మాత్రమే కాదు... దీని వెనుక బలమైన రాజకీయ సందేశం ఉందనేది విశ్లేషకుల అంచనా.

రాజకీయ సవాళ్లు.. ప్రతిసవాళ్లు

గతంలో "తెలంగాణలో పవన్‌ను అడుగు పెట్టనివ్వం", "సభను జరగనివ్వం" అంటూ కొందరు నేతలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ సభ జరగనుండటం విశేషం. ఈ సవాళ్లకు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రజా స్పందనే అసలైన సమాధానమా?

రాజకీయాల్లో విమర్శలకు మాటల కంటే ప్రజా మద్దతుతో సమాధానం చెప్పడమే అత్యంత ప్రభావవంతమైన వ్యూహం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఎలాంటిదో ఈ సభకు వచ్చే జనాన్ని బట్టి తేలిపోనుంది. ఏపీలో పవన్ సాధించిన విజయం తర్వాత తెలంగాణలో జనసేన ఉనికిని చాటుకోవడానికి, భవిష్యత్తు పొత్తులు లేదా ఒంటరి పోరాటానికి ఈ సభ మైలేజ్ ఇవ్వనుంది. విమర్శల మధ్య సభను విజయవంతం చేయడం ద్వారా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చని పార్టీ భావిస్తోంది.

మరికొన్ని గంటల్లోనే తేలనున్న సస్పెన్స్!

గత 10 రోజులుగా సాగుతున్న రాజకీయ హైడ్రామాకు, విమర్శలకు జూన్ 2 వేదికగా తెరపడనుంది. విమర్శకుల ఆరోపణలు నిలుస్తాయా? లేక పవన్ కళ్యాణ్ సభకు తరలివచ్చే ప్రజా ప్రభంజనం ఆ విమర్శలను కొట్టుకుపోయేలా చేస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చర్చలకు, సమీకరణాలకు దారితీయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అందరి కళ్ళు ఇప్పుడు జూన్ 2 సభపైనే కేంద్రీకృతమయ్యాయి.