Begin typing your search above and press return to search.

గులాబీపై ‘సాఫ్ట్’.. హస్తంపై ‘హాట్’.. పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది?

తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరతీశాయి.

By:  Tupaki Political Desk   |   11 Jun 2026 1:21 PM IST
గులాబీపై ‘సాఫ్ట్’.. హస్తంపై ‘హాట్’.. పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది?
X

తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరతీశాయి. హైదరాబాద్‌లో అడుగుపెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత 13 నెలలుగా తనను ఇబ్బంది పెడుతోందని పవన్ ఆరోపించడం సంచలనంగా మారింది. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పవన్ ప్రశంసలు కురిపించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా అవుతోంది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పవన్ క్లీన్ చిట్ ఇచ్చారు. పవన్‌ను "పొలిటికల్ టూరిస్ట్" అని తీవ్రంగా విమర్శించిన బీఆర్ఎస్ పై పవన్ ఇప్పుడు ఇంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. ఆయన మాటల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి? దీని వెనుక ఢిల్లీ పెద్దల స్క్రిప్ట్ ఉందా? లేక ఇదొక సైలెంట్ ఆపరేషనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో జనసేన కీలక భాగస్వామి. తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రధాన శత్రువుగా భావిస్తున్న బీజేపీ.. అక్కడ తన బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ పెద్దలు ఏమైనా వ్యూహం రచిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అగ్రనాయకత్వంతో ఉన్న బలమైన సంబంధాల నేపథ్యంలో వారి సూచనల మేరకు పవన్ తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకును ఏకం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారా? అని సందేహిస్తున్నారు. కాంగ్రెస్‌పై విమర్శల దాడి పెంచడం ద్వారా బీజేపీ హైకమాండ్ మనసు గెలుచుకోవడం పవన్ ప్రాథమిక లక్ష్యం కావచ్చునని చెబుతున్నారు.

బీఆర్ఎస్ ను కూటమిలోకి తెచ్చేందుకా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం తీవ్ర నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ ను భవిష్యత్తులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి తీసుకువచ్చేందుకు పవన్ కళ్యాణ్ ద్వారా ఏదైనా 'సైలెంట్ ఆపరేషన్' మొదలైందా? అనే సరికొత్త చర్చ కూడా జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల నుండి కొంత ప్రతిఘటన వచ్చినప్పటికీ, పవన్ మాత్రం కేవలం కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి శత్రువుగా మార్చడం ద్వారా, భవిష్యత్తులో బీఆర్ఎస్-బీజేపీ-జేఎస్పీల మధ్య ఒక అవగాహన కుదిర్చేందుకు ఈ కామెంట్స్ గ్రౌండ్ ప్రిపరేషన్‌లా పనిచేస్తున్నాయా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌కు రాకుండా కాంగ్రెస్ తనను 13 నెలలుగా అడ్డుకుంటోందని పవన్ అనడం వెనుక తెలంగాణలో జనసేన క్యాడర్‌ను యాక్టివేట్ చేసే వ్యూహం కూడా ఉందని అంటున్నారు. తెలంగాణలో జనసేన విస్తరణకు కాంగ్రెస్ అడ్డుపడుతోందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదే సమయంలో గత గులాబీ పాలనలో తనకు స్వేచ్ఛ ఉందని చెప్పడం ద్వారా కాంగ్రెస్ మార్క్ రాజకీయాలపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాలనేది పవన్ ప్లాన్ కావచ్చునని అంటున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలే నిదర్శనంగా చెబుతున్నారు. ఒకప్పుడు తనను తీవ్రంగా దూషించిన బీఆర్ఎస్ పట్ల పవన్ సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం వెనుక తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే పెద్ద స్కెచ్చే ఉందని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.