బాబు బెంగాల్...పవన్ తమిళనాడు
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో రెండవ అతి పెద్ద మిత్ర పక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది.
By: Satya P | 23 March 2026 12:00 PM ISTకేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో రెండవ అతి పెద్ద మిత్ర పక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ స్థాయి రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న వారు, ఎంతో మంది నేతలతో పరిచయం ఉన్న వారు. ఇక మరో వైపు చూస్తే బాబు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో గతంలో ప్రచారం నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీయేకి కేంద్రంలో నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఇపుడు మిత్రుల వైపు చూస్తోంది. దానికి కారణం దేశంలో నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో బీజేపీ ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి. అందుకే మిత్రులను ఈసారి గట్టిగా వాడుకోవాలని బీజేపీ నిర్ణయించింది అని అంటున్నారు.
మమతకు పోటీగా బాబు :
బీజేపీకి అస్సాం రాష్ట్రంలో మరోసారి గెలుపు మీద నమ్మకం ఉంది. అయితే బీజేపీకి మరో రెండు రాష్ట్రాల్లో గెలుపు అవసరం. అది జరిగితేనే బీజేపీకి జాతీయ స్థాయిలో ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాలలో ఒకటి పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ని ఓడించడం, నిజానికి ఈ పనిని 2021 ఎన్నికల్లో బీజేపీ చేయాలని చూసింది కానీ సాధ్యపడలేదు, కానీ ఈసారి అది అయ్యేలా చూసుకుంటోంది. ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. దాంతో టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి బాబుని పశ్చిమ బెంగాల్ కి పంపించడానికి బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. ఆ విధంగా మమతకు చెక్ పెట్టాలని వ్యూహరచన చేస్తోంది అంటున్నారు. ఈ మేరకు బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. దాంతో బాబు తన ఎన్నికల ప్రచారాన్ని బెంగాల్ లో మూడు రోజుల పాటు చేస్తారు అని అంటున్నారు.
పవన్ తో మ్యాజిక్ :
ఇక తమిళనాడు బీజేపీకి చాలా కీలకమైనదిగా చెబుతున్నారు. అక్కడ డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ ని ఈసారి ఓడించకపోతే రెండోసారి అధికారం చేపట్టి మరింతగా బలపడతారు. దాంతో ఇండియా కూటమి 2029 నాటికి బలంగా మారుతుంది. అందుకే తమిళనాడులో ఎన్డీయే కూటమి ప్రభుత్వం స్థాపించాలని బీజేపీ గట్టి పట్టుదల మీద ఉంది. ఈ క్రమంలో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆయన సినీ గ్లామర్ తో పాటు ఆయన ఫైర్ బ్రాండ్ స్పీచ్ ని వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. దాంతో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక పవన్ తమిళనాడులో ఎన్డీయేకు మద్దతుగా కొన్ని రోజులు ప్రచారం చేస్తారు అని అంటున్నారు.
అంచనాలు ఇవే :
ప్రస్తుతం ఉన్న అంచనాలు చూస్తే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి చాన్స్ ఉందని, తమిళనాడులో స్టాలిన్ కి ఎడ్జ్ ఉందని అంటున్నారు. కేరళలో అయితే కాంగ్రెస్ అధికారం అందుకుంటుందని చెబుతున్నారు. పాండిచ్చేరిలోనే ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అంటే సేం టూ సేం సీఎన్ అలాగే ఉంటుందన్న మాట. దీనిని మార్చాలని తాము మరింతగా బలం పుంజుకోవాలని ఎన్డీయే పెద్దలు భావిస్తున్నారు. దాంతో వారు మిత్రులను కూడా ప్రచారం కోసం రంగంలోకి దింపుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
