మోడీ భుజం కాసిన పవన్ !
ప్రధానిగా తిరుగులేని అధికారాన్ని గత పన్నెండేళ్ళుగా చలాయిస్తూ దేశంలో తిరుగులేని నాయకుడిగా నిలిచిన నరేంద్ర మోడీ ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు.
By: Satya P | 2 Aug 2026 1:42 AM ISTప్రధానిగా తిరుగులేని అధికారాన్ని గత పన్నెండేళ్ళుగా చలాయిస్తూ దేశంలో తిరుగులేని నాయకుడిగా నిలిచిన నరేంద్ర మోడీ ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు. సంక్లిష్టమైన పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. నిజంగా చూస్తే పశ్చిమ బెంగాల్ లాంటి అతి పెద్ద స్టేట్ ని గెలిచి మమతా బెనర్జీ లాంటి బలమైన నాయకురాలిని విపక్షంలో కూర్చోబెట్టిన విజయ గర్వంతో ఉండాల్సిన బీజేపీ వర్షాకాల పార్లమెంట్ సీజన్ లో విపక్షాల నుంచి ఎంతలా ప్రతిఘటన ఎదుర్కొంటోందో అంతా చూస్తూనే ఉన్నారు. అంతే కాదు సీజేపీ అన్న ఒక వాట్సప్ పొలిటికల్ పార్టీ జంతర్ మంతర్ వద్ద చేసిన నిరసనల దెబ్బకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మోడీకి అమిత్ షాకి అత్యంత సన్నిహితుడైన ఆ కేంద్ర మంత్రి నిరసనల మధ్య తప్పుకోవడం బీజేపీకి రాజకీయంగా గట్టి షాక్ అయితే మోడీకి వ్యక్తిగతంగా అది మరింత ఇబ్బంది పెట్టే అంశం అయింది.
బీజేపీలో తర్జన భర్జన :
ఇదిలా ఉంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న విద్యార్ధుల నిరసనల నుంచి పార్లమెంట్ సవ్యంగా సాగకపోవడం వంటి వాటి మీద బీజేపీలోనే అంతర్మధనం సాగుతోంది. అంతే కాదు తమ అధినాయకత్వం చేస్తున్నది ఏ మేరకు కరెక్ట్ అన్నది కూడా తర్జన భర్జన పడుతున్న నేపథ్యం ఉందని అంటున్నారు. విద్యార్ధుల ఉద్యమం తీసుకుంటే బీజేపీ పెద్దలు వ్యూహాత్మక లేమితో తెగే దాకా లాగారు అన్నది కూడా కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చగా ప్రచారంలో ఉంది. మరో వైపు ఎన్డీయేకు పాతిక దాకా మిత్ర పక్షాలు ఉంటే కష్ట సమయంలో ఎవరూ గట్టిగా నిలిచి నోరు విప్పలేదన్న విమర్శలు ఉన్నాయి. దానికి కారణం అక్కడ ఉన్నది జెన్ జీ యువత. వారితో పెట్టుకోవడం ఎందుకు అన్నది ఒకటి అయితే రెండవది బీజేపీ పెద్దలు విద్యార్థుల ఇష్యూని సరిగ్గా డీల్ చేయలేకపోయారు అన్నది ఏదో వారిలో ఉందని అంటున్నారు.
నిజమైన మిత్రుడిగా :
ఇక జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వారి ఆవేశం కట్టలు తెంచుకుంది. అసలే యువత, దాంతో చాలా మంది పరుషంగానే మాట్లాడారు, అందులో కొంతమంది అదుపు తప్పి మోడీ మీద వ్యక్తిగతంగా దూషణలు చేశారు. ఆయన తల్లి మీద కూడా విమర్శలు చేశారు. ఇది నిజంగా దారుణమైన విషయం. ఆందోళనలు వేరు, విద్యార్ధుల డిమాండ్లు వేరు మధ్యలో వ్యక్తిగత దూషణలు ఎందుకు, రాజకీయ ప్రకటనలు ఎందుకు ఇది అందరిలో ఉంది. అయితే దీని మీద కూడా ఎన్డీయే మిత్రుల నుంచి స్పందన అయితే లేదు, ఆ మాటకు వస్తే బీజేపీ నుంచి కూడా పెద్ద నేతల స్పందన అంతగా లేదని అంటున్నారు. ఆఖరుకు మోడీ స్వయంగా ఒక వీడియో చేసి మరీ తనను తన తల్లిని దారుణంగా దూషించారు అని చెప్పుకోవాల్సి వచ్చింది. అయినా సరే వారిని క్షమిస్తున్నాను అని ఆయన పెద్ద మనసు చాటుకున్నారు. ఈ కీలక సమయంలో మోడీకి మద్దతుగా నిలిచి నిజమైన మిత్రుడిగా చాటుకున్నది మాత్రం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు.
గుండె కదిలిపోయింది అంటూ :
ప్రధాని మోడీని ఉద్దేశించి జంతర్ మంతర్ వద్ద కొందరు దూషణలకు దిగడం చూసి తన గుండె కదిలిపోయింది అని పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఓపెనింగ్ సందర్భంగా ఆయన ఈ ప్రస్తావన తెచ్చి మరీ మోడీకి తాను గట్టి మద్దతుగా నిలబడడమే కాదు మీకు అండగా మేమున్నామని నిబ్బరంగా చెప్పారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటూ ఆయన ఉదహరిస్తూ మోడీ వంటి వారిని అంతా కలసి కాపాడుకోవాలని అన్నారు. ఇంత ధైర్యంగా ఓపెన్ గా పవన్ చెప్పడం ద్వారా ఈ క్లిష్ట సమయంలో మోడీ భుజం కాసారని అంటున్నారు. ఒక నిజమైన మిత్రుడిగా వ్యవహరించారు అని అంటున్నారు. పవన్ ఈ మాటలు అంటున్నపుడు రాజకీయ సమీకరణలు చూసుకోలేదు, తన వ్యాఖ్యల వల్ల అవతల పక్షంలో ఎవరో వేరేగా తీసుకుంటారని కూడా అనుకోలేదు, పైగా యువత మనకు వనరులు అని చెబుతూ వారిని సక్రమంగా పెంచాలని సంస్కారం నేర్పాలని ఆయన తల్లిదండ్రులకు సూచించడం ద్వారా బ్యాలెన్స్ చేశారు. మొత్తానికి మోడీకి ఎన్డీయే నుంచి గట్టి మిత్రుడు తానే అని పవన్ మరో సారి రుజువు చేసుకున్నారు. పవన్ ఈ మాటలు చెబుతున్నపుడు మోడీ గంభీరంగా వింటూ ఉండడం కూడా అందరికీ కనిపించింది.
