Begin typing your search above and press return to search.

నేను బీజేపీలో ఉండి ఉంటే....పవన్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత. ఒక ప్రాంతీయ పార్టీని పెట్టుకుని పుష్కర కాలంగా దానిని నడిపిస్తూ ఏపీలో మూడు ఎన్నికలను చూసిన వారు.

By:  Satya P   |   6 Jun 2026 12:38 AM IST
నేను బీజేపీలో ఉండి ఉంటే....పవన్ సంచలన వ్యాఖ్యలు
X

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత. ఒక ప్రాంతీయ పార్టీని పెట్టుకుని పుష్కర కాలంగా దానిని నడిపిస్తూ ఏపీలో మూడు ఎన్నికలను చూసిన వారు. అంతే కాదు గత రెండేళ్ళుగా ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన అధికార స్థానంలో ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి ట్యాగ్ ఉండనే ఉంది. అయితే పవన్ కి బీజేపీ దగ్గరా మోడీ దగ్గరా అంటే అందరూ అనుకునేది మోడీ దగ్గర అని. ఆయన మీద అభిమానంతోనే పవన్ బీజేపీతో దోస్తీ చేస్తున్నారు అని చెబుతారు. ఇక గతంలో అనేక సందర్భాలలో పవన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అన్న ప్రచారం కూడా సాగింది. దానిని పవన్ ఖండించారు కూడా. కానీ లేటెస్ట్ గా పవన్ ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ చూస్తే సంచలనంగా ఉన్నాయి.

సందర్భం ఏదైనా :

ఇక పవన్ అన్న సందర్భం చూస్తే వేరు. తమిళనాడులో బీజేపీకి చీఫ్ గా వ్యవహరించిన కీలక నేత అన్నామలై ఆ పార్టీకి దూరం అయ్యారు. దాని మీద ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పవన్ జవాబు ఇస్తూ తాను బీజేపీలో ఉండి ఉంటే అన్నామలై కోసం ఏమైనా చేసేవాణ్ని అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు అన్నామలై చాలా సమర్ధవంతమైన నాయకుడు అని మంచి నేత అని కొనియాడారు. అలాంటి నేతలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు.

ఆయన్ని తిరిగి చేర్చేందుకు :

తాను బీజేపీలో ఉంటే అన్నామలైని తిరిగి పార్టీలోకి చేర్చేందుకు ప్రయత్నించేవాడిని అని పవన్ చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో ఆయన మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. బీజేపీకి దక్షిణాదిన నేతల కొరత ఉందని అన్నారు. ఉత్తరాదిన అగ్ర నేతలు అంతా ఉన్నారని చెప్పారు బీజేపీని సౌత్ లో బలోపేతం చేయాలంటే స్థానిక నేతలను ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అలాంటి బలమైన స్థానిక నేతగా అన్నామలైని పవన్ పేర్కొన్నారు.

కొత్త చర్చగా :

పవన్ బీజేపీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఈ కామెంట్స్ చేయడం కొత్త చర్చకు దారి తీస్తోంది. సాధారణంగా ఇతర పార్టీల నేతలు అంతా తమకు సంబంధం లేనట్లుగానే ఉంటారు. అది వారి పార్టీ అంతర్గత వ్యవహారంగానే చూస్తారు. కానీ పవన్ మాత్రం బీజేపీ గురించి అంతలా ఆలోచించడం మీదనే చర్చ సాగుతోంది. పైగా దక్షిణాదిన బలమైన నేతలు లేరని ఆయన చేస్తున్న కామెంట్స్ స్థానిక నేతలను ప్రోత్సహించాలని అంటున్న తీరు ఇవన్నీ చూస్తే బీజేపీ విషయంలో పవన్ మిత్రుడిగా కంటే ఎక్కువగానే ఆలోచిస్తున్నారా అని కూడా విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీకి మంచి నేత ఒకరు లేకుండా పోతున్నారు అన్న ఆవేదన సాటి మిత్రుడిగా పవన్ లో ఉండడం అయితే తప్పు లేదని అంటున్నారు. అదే సమయంలో ఆయన తాను కనుక బీజేపీలో ఉండి ఉంటే అన్న మాటల వెనక అర్ధాలను వెతికే వారూ ఉన్నారని అంటున్నారు.