పవర్ స్టార్ ఇచ్చిన పవర్.. 78 ఏళ్ల తర్వాత గిరిజన గూడెంకి విద్యుత్ కాంతులు!
అటవీ మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్.. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
By: Tupaki Political Desk | 6 Nov 2025 10:21 AM ISTకూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ.. పేద ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోంది. రాష్ట్రాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా టీడీపీతో జట్టు కట్టి కూటమి స్థాపించిన డిప్యూటీ సీఎం తన ఆశయాలకు తగ్గ పనితీరుతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు గట్టి మద్దతు ఇస్తున్న పవన్.. తన మార్క్ పాలనతో ఆకట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఫలాలు అందుకోలేని అభాగ్యులకు ఆసరగా నిలుస్తూ.. చేదోడువాదోడుగా మారుతున్నారు.
అటవీ మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్.. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మారుమూల పల్లెల్లో పర్యటిస్తూ అక్కడ నివసిస్తున్న ఆదివాసీలు, గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న పవన్.. తాను మాటిచ్చిన పనులు పూర్తయ్యేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీనికి అల్లూరి సీతారామారాజు జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం అనే చిన్న గ్రామమే నిదర్శనంగా చెబుతున్నారు.
ఐదు నెలల క్రితం ఆ గ్రామాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్, అక్కడ నివసిస్తున్న గిరిజనుల బాధలను చూసి చలించిపోయారు. సుమారు 17 కుటుంబాలు నివసిస్తున్న ఆ గ్రామానికి ఇంతవరకు సరైన రోడ్డు లేదు. కనీసం కరెంటు సౌకర్యం లేదు. స్వాంతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా.. గూడెం గిరిజనులు మాత్రం చీకట్లోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ గ్రామాన్ని తొలిసారి సందర్శించిన ఓ ప్రజాప్రతినిధిగా పవన్ రికార్డు నెలకొల్పారు. గూడెం వాసుల బాధలను తొలగించాలని నిర్ణయించిన ఉప ముఖ్యమంత్రి ముందుగా గ్రామానికి విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని భావించారు.
అక్కడికక్కడే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి.. వెంటనే పనులు ప్రారంభానికి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో యంత్రాంగం పరుగులు తీసింది. కేవలం ఐదు నెలల్లోనే గూడెం గ్రామానికి వెలుగులు అందేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. కొండ కోనలు, అడవుల మధ్య నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర విద్యుత్ లైను వేసింది. ఇందుకోసం 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయగా, సుమారు రూ.80 లక్షల వ్యయమైంది. వాయువేగంతో పనులు పూర్తి చేయడంతో బుధవారం కార్తీక పౌర్ణమి రోజున గూడెం గ్రామంలో ప్రతి ఇంటికీ విద్యుత్ సరఫరా చేశారు.
కనీస సౌకర్యాలు లేని తమ గ్రామానికి ఉప ముఖ్యమంత్రి చొరవతో విద్యుత్ సరఫరా కావడంపై గిరిజనులు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. పవన్ సంకల్పంతో దశాబ్దాల చీకటి తొలగి గిరిజన గూడెంకి తొలిసారి వెలుగు రావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కార్తీక పౌర్ణమి వెన్నెల రోజున తమ ఇళ్లలో విద్యుత్ కాంతులను చూసిన గిరిజనులు ఇది పవర్ స్టార్ తెచ్చిన పవన విద్యుత్తుగా సంబరపడుతున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తోపాటు మరికొందరు జనసేన నేతలు బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సంతోషాన్ని పంచుకున్నారు.
యజ్ఞం చేసిన విద్యుత్ సిబ్బంది
ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో కార్యరంగంలోకి దిగిన విద్యుత్ శాఖ సిబ్బంది ఒక పెద్ద యజ్ఞమే చేశారని చెప్పకతప్పదు. మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండే ఈ గిరిజన గూడెం కొండ శిఖరంపై ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల మధ్య విద్యుత్ స్తంభాలు పాతడం, లైన్లు వేయడం, స్తంభాల రవాణాను పూర్తి చేయడంలో విద్యుత్ సిబ్బంది అంకితభావాన్ని మెచ్చుకోకతప్పదు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ కు అనుసంధానించారు. పీఎం జన్ మన్ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన్ విద్యుత్ తో కూడిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. ఇది గిరిజన గూడెంలో నిర్మించిన తొలి పవర్ గ్రిడ్ గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా గూడెంలో ఉన్న ప్రతి ఇంటికి విద్యుత్ వైరింగు చేయించడంతోపాటు ఒక్కో ఇంటికి ఐదు బల్బులు, ఫ్యాన్ ఉచితంగా అందజేశారు.
