Begin typing your search above and press return to search.

పవన్ పొగడ్తలకు పడిపోతున్నారా ?

ఇక పవన్ ని అభిమానించే వారు కానీ అనుచరులు కానీ ఆయన సొంత సామాజిక వర్గం నేతలు కానీ ఆవేదన చెందేది ఒక్కటే. మా నాయకుడు గట్టిగా నిలబడాలి అని.

By:  Satya P   |   14 Jun 2026 10:11 AM IST
పవన్ పొగడ్తలకు పడిపోతున్నారా ?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వతహాగా తక్కువ మాట్లాడుతారు. ఆయన వేదికల మీద ఎక్కువే మాట్లాడినా బయట మాత్రం ఆయన ధోరణి భిన్నంగా ఉంటుందని చెబుతారు. అంతే కాదు ఆయన సిగ్గరి అని అంటారు. ఆ విషయం పవన్ కూడా అనేక సందర్భాలలో వేదిక మీదనే చెప్పుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మొహమాటాలు పవన్ కి ఉన్నాయా అన్న చర్చ కూడా వస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఎంత ఆవేశంగా మాట్లాడినా ఆయన లోపలి మనసు మాత్రం ఎంతో మెత్తన అని ఎరిగిన వారు చెబుతారు. తన మనసులో ఏదీ దాచుకోకుండా ఆయన మాట్లాడేస్తారు. రాజకీయాల్లో అది కుదిరే వ్యవహారం అయితే కాదు. లౌక్యం ఉండాలి. పవన్ కి అది తెలియదనే అంటారు. అందుకే సూపర్ స్టార్ గా ఉంటూ ఎంతో క్రేజ్ ఉన్న పవన్ రాజకీయాల్లో మాత్రం అభిమానులు కోరుకున్న సీఎం స్థానానికి చేరుకోలేకపోయారు అని అంటున్నారు.

పదవులపైన వ్యామోహం లేదు :

ఇక పవన్ తరచూ చెప్పే మాట తనకు పదవుల మీద వ్యామోహం లేదని. నిజమే. పవన్ కి అలా వ్యామోహం ఉంటే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, నేరుగా ఏ రాజకీయ పార్టీలో చేరినా ఆయనకు ఈ మంత్రి పదవులు ఏనాడో వచ్చేవి అని కూడా అంటారు. అయితే పవన్ ఫిలాసఫీని కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయన ఏ మాట మాట్లాడినా అందులో మానవీయ కోణాన్ని చేర్చి చూస్తారు. అందుకే ఆయన లెఫ్ట్ రైట్ అన్న భిన్న మార్గాలను అనుసరించరు. ఈ ఫిలాసఫీని గట్టిగా నమ్మిన వారికి పవన్ ది అవకాశ వాదంగా కనిపిస్తుంది. ఆయన అన్యాయం అనిపించింది మాట్లాడుతారు. నిజం చెప్పాలంటే ఏ ఫిలాసఫీ కూడా నూరు శాతం కరెక్ట్ కాదు. అలాంటపుడు పవన్ మానవీయ కోణంలో ఆలోచించడాన్ని ఎలా తప్పుగా చూస్తారు అన్న ప్రశ్న కూడా అభిమానుల నుంచి వస్తుంది.

త్యాగం చేశామని :

పవన్ తాజాగా జరిగిన తిరుపతి సభలో మాట్లాడుతూ తాము 21 సీట్లకు పరిమితం కాలేదని రాష్ట్రం భవిష్యత్తుని కోరుతూ త్యాగం చేశామని చెప్పారు. అది నూరు శాతం నిజం. ఎందుకంటే పవన్ కనుక రాజకీయంగా వ్యవహరించి ఉంటే 2024 లో సీట్ల కోసం గట్టిగానే పట్టుబట్టేవారు. ఆ సమయంలో ఆయన ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చే స్థితిలోనే మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి. కానీ పవన్ కూటమి కట్టాలి అందరినీ ఒక చోట చేర్చాలి వైసీపీని గద్దె దించాలని అనుకున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది దానిని అంతమొందించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్ళారు కాబట్టే ఆయన రాజకీయంగా బాగా తగ్గారని అంతా అంటున్నారు.

వారి ఆవేదన అదే :

ఇక పవన్ ని అభిమానించే వారు కానీ అనుచరులు కానీ ఆయన సొంత సామాజిక వర్గం నేతలు కానీ ఆవేదన చెందేది ఒక్కటే. మా నాయకుడు గట్టిగా నిలబడాలి అని. రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడటం కరెక్టే అయినా అది ఒక్క తమ పార్టీకే బాధ్యత కాదు కదా అన్న వాదనను వారు వినిపిస్తున్నారు. తమ నాయకుడు మొహమాటానికి పోతే కనుక ఇబ్బందులు వస్తాయని కూడా వారు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే 2029 ఎన్నికల్లో పవన్ మొహమాటాలకు పోకుండా అధిక సీట్లు కోరాలని తద్వారా ఆయన వచ్చే ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు అయినా కూర్చోవాలని అంతా కోరుతున్నారు. ఇక ఆయన పొగడ్తలకు లొంగిపోతున్నారు అన్నది కూడా చెబుతున్నారు. అలాంటి వాటిని దూరం చేసుకోవాలని కూడా అంటున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో చూస్తే పవన్ మీద ఏ అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు లేవు. ఆయన రెండేళ్ళ నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చినా ఆయన తన నిజాయితీని నిబద్ధతను చూపిస్తున్నారు అంటే ఇదే రానున్న రోజులలో ఆయనకు శ్రీరామ రక్ష అని అంటున్నారు అంతా.