Begin typing your search above and press return to search.

వైసీపీ పై పవన్ సనాతన ధర్మాగ్రహం

దేవ దేవుడిని కొలిచే మంత్రాలను నామాలను ఈ విధంగా అపహాస్యం చేస్తారా అంటూ ఆయన గర్జించారు. ఇక ఇలాంటి వాటిని ఆపాలని ఆయన వైసీపీకి గట్టిగానే సూచించారు.

By:  Satya P   |   10 Aug 2026 11:46 PM IST
వైసీపీ పై పవన్ సనాతన ధర్మాగ్రహం
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాగ్రహం మరో సారి చూపించారు. వైసీపీ మీద ఆయన ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఏమి జరిగింది అంటే మెగా డీఎస్సీ మీద వైసీపీ చేస్తున్న ఆందోళనలలో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలను భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడమే. వైసీపీ నేతలు ఈ విధంగా ఎలా చేస్తారు అంటూ పవన్ మండిపడ్డారు. దేవ దేవుడిని కొలిచే మంత్రాలను నామాలను ఈ విధంగా అపహాస్యం చేస్తారా అంటూ ఆయన గర్జించారు. ఇక ఇలాంటి వాటిని ఆపాలని ఆయన వైసీపీకి గట్టిగానే సూచించారు.

ప్రతిపక్ష హోదా కూడా లేదు :

వైసీపీకి ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా లేదని పవన్ ఈ సందర్భంగా ఆక్షేపించారు. అలాంటి పార్టీ ఒకటి నెల్లూరు నగరంలో తన రాజకీయం కోసం పవిత్ర గోవింద నామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరిచిన తీరు దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించిన వారే అని ఆయన విమర్శించారు.

మత విద్వేషాలు రేపే కుట్ర :

ఈ విధంగా చేయడం ద్వారా ఏపీలో మతపరమైన విద్వేషాలు రేపే కుట్ర పూరిత ఆలోచనలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఈ తరహా చర్యలకు పాల్పడిన వరి మీద చట్టపరంగా ముందుకు వెళ్ళాలని జనసేన పార్టీ నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ధార్మిక విశ్వాసాలను దెబ్బ తీసారని పవన్ పేర్కొన్నట్లుగా జనసేన కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రజల ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవ నామాలు అలాగే మంత్రాలు స్తోత్రాలు, కీర్తనలను అపహాస్యం కోసం వాడే విధానాన్ని అందరూ విడిచిపెట్టాలని పవన్ గట్టిగానే సూచించారు.

వైసీపీ ఎమ్మెల్సీ మీద ఫిర్యాదు :

ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిపై జనసేన నేతలు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతిలోని ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కిరణ్‌ రాయల్‌ ఆధ్వర్యంలో ఈ మేరకు ఫిర్యాదు అందచేసినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నేతలు మెగా డీఎస్సీ అభ్యర్ధుల విషయంలో అక్రమాలు అంటూ చేస్తున్న ఆందోళనలో భాగంగా నెల్లూరులో తిరుమల శ్రీవారి భక్తి గీతాన్ని అవహేళన చేసేలా వ్యవహరించారని తమ ఫిర్యాదులో జనసేన నేతలు ఆరోపించారు. శ్రీవారి నామాల పాటను తమ రాజకీయానికి అనుకూలంగా పేరడీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని జనసేన నేతలు సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉందని అందుకే ఈ విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నెల్లూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఈ ఘటనలో పాల్గొన్న ఇతర నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన కోరడం విశేషం.