Begin typing your search above and press return to search.

పవన్ ఫుల్ ఫోకస్ వాటి మీదనే...టార్గెట్ అదేనా ?

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతున్నారు.

By:  Satya P   |   9 Aug 2026 6:00 AM IST
పవన్ ఫుల్ ఫోకస్ వాటి మీదనే...టార్గెట్ అదేనా ?
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతున్నారు. ఒక వైపు పార్టీ అధినేతగా జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మరో వైపు ఉప ముఖ్యమంత్రిగా తన దగ్గర ఉన్న ప్రాధాన్యత కలిగిన శాఖలను పూర్తిగా అవగాహన చేసుకుని వాటి పనితీరులో మెరుగుదల చూపిస్తున్నారు. అటవీ శాఖ ద్వారా గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేయించి అడవి తల్లి బాట పేరుతో వారికి దారి చూపిస్తున్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. పనిలో పనిగా పర్యావరణ శాఖ మీద కూడా ఆయన దృష్టి పెట్టారు. ఇటీవల అనకాపల్లి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన పంచదార్ల వద్ద అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలిసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని కూడా సూచించారు.

బూత్ లెవెల్ నుంచి :

ఇక పార్టీ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ బూత్ లెవెల్ నుంచి జనసేనను పటిష్టం చేసే కార్యక్రమం ముమ్మరం చేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికే పెద్ద పీట వేస్తున్నారు. అంతే కాక వారు జనసేనలో ఏళ్ళ తరబడి పనిచేసేలా ఉండడమే అర్హతగా చూసుకుంటున్నారు. రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో జనసేన జెండా ఎత్తిన వారికే సీట్లు అన్న విధానం కూడా తీసుకుని రావాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ విధంగా జనసేనను నమ్ముకుంటే తమకు న్యాయం జరిగింది అన్నది పార్టీ క్యాడర్ అంతా అనుకుని సుదీర్ఘ కాలం పాటు గట్టిగా నిలబడేలా జనసేన అధినాయకత్వం పక్కాగా ప్రణాళికలను రచిస్తోంది అని అంటున్నారు.

ఆ వైపు చూడడం కంటే :

ఇక దైనందిన విషయాల్లో ప్రత్యర్థుల మీద విమర్శలు ఉంటూ ఉంటాయి. వైసీపీ మీద ప్రతీ రోజూ విమర్శలు చేసే విధానానికి జనసేన దూరంగా ఉంటోంది. అందుకే ఆ పార్టీ తన లక్ష్యాలను ఏమిటో నిర్దేశించుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగుతోంది అని అంటున్నారు. వారిని వీరు వీరిని వారు విమర్శించుకోవడం వల్ల ఉపయోగం లేదని మీడియాలో హైప్ క్రియేట్ కావడం తప్ప గ్రౌండ్ లెవెల్ లో ఏమీ ఉండదని జనసేన భావిస్తోంది. అందుకే జనసేన ఈ తరహా విమర్శల రాజకీయానికి దూరంగా ఉంటోంది అని అంటున్నారు.

అక్కడే చూపు అంటూ :

ఇక జనసేన 2029 ఎన్నికల మీదనే తన చూపు నిలిపింది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొత్తులో భాగంగా కోరాలీ అంటే ముందు పార్టీగా బలపడాల్సిన అవసరం ఉందని జనసేన నమ్ముతోంది. పార్టీకి బూత్ లెవెల్ నుంచి క్యాడర్ అలాగే ద్వితీయ తృతీయ శ్రేణి నేతలతో పాటు నియోజకవర్గాన్ని నడిపించే బలమైన నాయకత్వం ఉంటే కచ్చితంగా ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు అని భావిస్తోంది. వచ్చే ఎన్నికలు జనసేనకు ఒక విధంగా కీలకం అని అంటున్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని 2024 మాదిరిగానే సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిస్తే కచ్చితంగా ఆ తరువాత ఏర్పడే ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు వీలు ఉంటుందని కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి జనసేన దీర్ఘ కాలం ఆలోచనలు చేస్తోంది. అందుకే సైలెంట్ గానే పవన్ తన పని ఏంటో చేసుకుని పోతున్నారు అని అంటున్నారు.