Begin typing your search above and press return to search.

పవన్ మౌనముద్ర...రాజకీయ చర్చ !

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. తన పనేంటో తానేంటో అన్నట్లుగానే ఆయన వైఖరి ఉంది.

By:  Satya P   |   30 July 2026 11:41 PM IST
పవన్ మౌనముద్ర...రాజకీయ చర్చ !
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. తన పనేంటో తానేంటో అన్నట్లుగానే ఆయన వైఖరి ఉంది. వాస్తవానికి పవన్ ఈ నెలలో ముంబైలోని కోకిలబెన్ ఆస్పత్రిలో తన కుడి భుజానికి ఆపరేషన్ చేసుకున్నారు. దాంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయన మంగళగిరి మకాం మార్చారు. అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చుని అధికారిక సమీక్షలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా చూస్తున్నారు. ఆగస్టు 14లోగా జనసేన పార్టీ పదవులు పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ దాకా కేటగిరీల కింద భర్తీ చేయాలని అనుకుంటున్నారు. దాని కోసం జనసేన పిలుపు మేరకు వచ్చిన 36 వేల దరఖాస్తులను పవన్ స్వయంగా పరిశీలిస్తున్నారు.

ప్రకటనలు లేవు :

అయితే ఒక వైపు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పవన్ మీడియా ముందుకు రావడంలేదు, సోషల్ మీడియాలో చూసినా ప్రకటనలు లేవు. ఇక ఈ మధ్యనే నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారు. అనారోగ్యం కారణంగా అని అది భావించినా కూడా ఆయన అయితే ఏపీలో జరుగుతున్న రాజకీయ కార్యక్రమాల మీద పెద్దగా రియాక్ట్ అవడం లేదు. ఈ మధ్యనే ముద్రగడ సంస్మరణ సభలు సంతాప సభలు జరుగుతున్నాయి. వాటికి టీడీపీ నేతలు హాజరవుతున్న దాని మీద టీడీపీ పెద్దలు గట్టిగా రియాక్ట్ అవుతునారు. జనసేన నేతలు వెళ్తున్నారు కానీ పవన్ మాత్రం వాటి మీద ఏ విధమైనా ఆంక్షలు పెట్టింది లేదు. మరో వైపు ఆయన మనసు అంతా జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేసే దాని మీదనే ఉంది అని అంటున్నారు. ఏపీలో జరుగుతున్న అనేక పరిణామాల మీద అయితే ఆయన ఈ సమయంలో అసలు నోరు విప్పడం లేదు.

పదవులు అన్నీ రద్దు :

మరో వైపు చూస్తే పవన్ జనసేన పదవులు అన్నీ రద్దు చేశారు. ఏకంగా 26 మంది రాష్ట్ర అధికార ప్రతినిధుల పదవులు రద్దు చేశారు. కొత్త వారిని నియమించేవరకూ ఏ జనసేన నాయకుడు కూడా మీడియా డిబేట్లలో టీవీ చర్చలలో పాలుపంచుకోఅవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో జనసేన తరఫున పవన్ మాత్రమే కాదు ఆయన పార్టీ కూడా ఏపీలో జరిగే ఏ పరిణామం మీద కూడా స్పందన తెలియచేసే అవకాశం లేదని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే రాజకీయంగా చర్చ సాగుతోంది. పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు కారణాలు ఏమిటి అని కూడా అంతా ఆలోచిస్తున్నారు.

స్థానిక వాటా పెరగాలి :

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 15 శాతం సీట్లు మాత్రమే అని ఆ మధ్య అయితే ఒక మాట టీడీపీ పెద్దల నుంచి వచ్చింది అని ప్రచారం సాగింది. దానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 2024 పరిస్థితులు వేరు 2026 పరిస్థితులు వేరు అని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా వాటా పెరాగాల్సిందే అన్న అభిప్రాయం అయితే జనసేనలో ఉంది. దానికి అనుగుణంగానే పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేస్తున్నారు. పనిచేసే వారికి గ్రౌండ్ లెవెల్ లో గట్టిగా నిలబడిన వారికే పట్టం కట్టాలని అనుకుంటున్నారు. ఇవన్నీ పూర్తి అయిన తరువాత కచ్చితంగా జనసేన తన వాటాని పెంచాలనే కోరుతుందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ మౌనం మాత్రం రాజకీయ చర్చకే దారి తీస్తోంది. పైగా ఆయన ఈ మధ్య ఏ అధికారిక కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ చేస్తున్నారు. దానికి కూడా పవన్ వస్తారా రారా అన్న సందిగ్దం ఉంది. ఎందుచేతనంటే ఆయన కుడి భుజం నొప్పి ఇంకా అలాగే ఉంది అని అంటున్నారు.