భుజం గాయానికి ఆపరేషన్… పవన్ కళ్యాణ్ కు 3 గంటల సర్జరీ..కానీ?
సర్జరీ కోసం ముంబై వెళ్లిన పవన్ కళ్యాణ్‌కు శుక్రవారం రోజంతా అన్ని రకాల మెడికల్ టెస్టులు చేశారు.
By: Madhu Reddy | 11 July 2026 11:32 AM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబైలో విజయవంతంగా సర్జరీ పూర్తయింది. గత కొంతకాలంగా ఆయన రెండు భుజాల రొటేటర్ కఫ్ గాయాలతో తీవ్రంగా బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు శనివారం ఉదయం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేయడం వల్ల వచ్చే నొప్పితో పాటు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని భావించిన డాక్టర్లు, ముందుగా కుడి భుజానికి మాత్రమే 3 గంటల పాటు శ్రమించి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు.
ముంబైలో విజయవంతంగా సర్జరీ:
చాలా రోజులుగా పవన్ కళ్యాణ్‌ను భుజం నొప్పులు వేధిస్తున్నాయి. రాజకీయ యాత్రలు, షూటింగుల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఇక దీంతో చెకప్ చేయించుకోగా సర్జరీ తప్పదని డాక్టర్లు తేల్చారు. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన పవన్‌కు నిపుణులైన వైద్య బృందం శనివారం ఉదయం ఆపరేషన్ చేసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్స సక్సెస్ అయిందని వైద్యులు ప్రకటించారు.
అసలు రొటేటర్ కఫ్ అంటే ఏంటి?:
మన భుజం ఫ్రీగా కదలడానికి, చేతులు పైకెత్తడానికి సాయపడే కండరాలు, నరాల సముదాయాన్నే రొటేటర్ కఫ్ అంటారు. ఈ భాగంలో గాయాలు కావడం లేదా నరాలు తెగడం లాంటివి జరిగితే చేతిని అస్సలు కదిలించలేం. తీవ్రమైన నొప్పితో పాటు బరువులు ఎత్తడం కూడా కష్టమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్‌కు ఈ సమస్య తీవ్రంగా మారడం వల్లే డాక్టర్లు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
శుక్రవారమే పరీక్షలు.. శనివారం ఆపరేషన్:
సర్జరీ కోసం ముంబై వెళ్లిన పవన్ కళ్యాణ్‌కు శుక్రవారం రోజంతా అన్ని రకాల మెడికల్ టెస్టులు చేశారు. నివేదికలన్నీ నార్మల్‌గా రావడంతో శనివారం ఉదయం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. కుడి భుజంలో దెబ్బతిన్న భాగాలను వైద్యులు విజయవంతంగా సరిచేశారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.
ఎడమ భుజానికి రెండు నెలల తర్వాత:
రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే రెండు చేతులూ పని చేయవు. రోజువారీ పనులకు కూడా వేరేవాళ్లపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే నొప్పి తీవ్రతను తగ్గించడానికి డాక్టర్లు ముందుగా కుడి భుజానికే సర్జరీ చేశారు. ఇక ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు. అప్పటివరకు పవన్‌కు ప్రత్యేక ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కొనసాగుతుంది.
డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్ కావడంతో జనసైనికులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు ఆయన కొన్ని రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాతే మళ్లీ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు.
